Begin typing your search above and press return to search.

14 తర్వాత ఏపీలో యుద్ధభేరి

By:  Tupaki Desk   |   30 Jan 2019 8:05 AM GMT
14 తర్వాత ఏపీలో యుద్ధభేరి
X
యుద్ధ సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యుద్ధ వాతావరణం రూపు దిద్దుకుంటోంది. యుద్ధ వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో జరుగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అధికార పార్టీ సకల అస్త్రాలు సిద్ధం చేసుకుంటూంటే ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులతో కలిసి ఎన్నికలను ఎదుర్కొవడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిబ్రవరి 14 వ తేదీని ముహుర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తన విజయానికి కారణమైన యాగాలనే ఏపీలో తన మిత్రుడు వై.ఎస్.జగన్మోన్ రెడ్డి విజయానికి కూడా ఆలంబనగా చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 14 వ తేదీన విశాఖపట్నంలో శారదా పీఠం వార్షికోత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హాజరవుతారు. అక్కడ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నిర్వహించే యాగంలో పాల్గొంటారు. ఈ యాగం ఫిబ్రవరి 10 నుంచి 14 వ తేది వరకూ జరుగుతుంది. యాగం 14 వ తేదిన జరిగే పూర్ణాహుతితో పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హాజరవుతారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ తన ప్రచారాన్ని, ఎన్నికల యుద్ధాన్ని యగం తర్వాతే చేపట్టారు.

విశాఖలో స్వరూపానందేంద్ర స్వామి యాగం ముగిసిన 14 వ తేదీనే అమరావతిలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇంటి గ్రహాప్రవేశం కూడా ఉంది. ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హాజరవుతారు. ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముహుర్తం ఖరారు చేస్తారని అంటున్నారు. అంటే కేసీఆర్ సెంటిమెంట్ ను తన మిత్రుడు జగన్మోన్ రెడ్డికి కూడా ఆపాదించి యాగ క్రతువు ముగిసిన తర్వాత కె.చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఫిబ్రవరి 14 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.