Begin typing your search above and press return to search.

మునుగోడును కారెక్కించేద్దాం.. కేసీఆర్ భారీ ప్లాన్‌

By:  Tupaki Desk   |   4 Oct 2022 3:30 PM GMT
మునుగోడును కారెక్కించేద్దాం.. కేసీఆర్ భారీ ప్లాన్‌
X
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేప‌థ్యంలో అధికార పార్టీ టీఆర్ ఎస్ జోరు పెంచింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు మాత్ర‌మే కాదు.. భారీ మెజారిటీని సైతం సొంతం చేసుకుని.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మరానికి... పార్టీని స‌ర్వ‌స‌న్న‌ద్ధం చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ భారీగా ప్లాన్ చేస్తోంది. దసరా వెళ్లిన‌ తెల్లారి నుంచే మునుగోడు ప్రచార పర్వంలోకి టీఎర్ఎస్ శ్రేణులు ప్రవేశించనున్నారు.

దీనికి సంబంధించి ప‌క్కా ప్లాన్ కూడా ఇప్ప‌టికే రెడీ అయిపోయింద‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నా యి. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వ‌ర‌కు.. అంద‌రూ కూడా.. మునుగోడులో మునిగితేలాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు. అనుక్ష‌ణం.. మునుగోడు జ‌పంగా నాయ‌కులు మెలిగేలా.. ప్ర‌జ‌ల‌ను క‌లిసేలా.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వారికి వివ‌రించేలా.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగ‌నున్నారు.

ఈ క్ర‌మంలోనే త్వరలో చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మునుగోడును కేసీఆర్ 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను నియమించారు.

వీరికి అక్క‌డి బాధ్య‌తులు అప్ప‌గించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కించే బాధ్య‌త వీరిదే. అలాగే మంత్రి హరీష్ రావు, మ‌రో మంత్రి కేటీఆర్ కు సైతం ప్రచార బాధ్యతలు అప్పగించారు.

ఒక్కో యూనిట్‌కు 20 మంది నేతలతో ప్రచార టీమ్‌ను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6 నుంచి గడప గడపనూ చుట్టేసేలా స్కెచ్ వేశారు. దసరా మరుసటి రోజే మునుగోడుకు వెళ్లాలని ఇన్‌చార్జ్‌లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అదేస‌మ‌యంలో మునుగోడు నుంచి టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేయ‌నున్న అభ్య‌ర్థిని ద‌స‌రా రోజే అధికారికంగా కేసీఆర్ ప్రకటించనున్నారు. దీంతో మునుగోడుపై కేసీఆర్ ప‌క్కా వ్యూహంతో అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.