Begin typing your search above and press return to search.

డియర్ గిన్నిస్ రికార్డ్సు..కేసీఆర్ గురించి తెలుసా?

By:  Tupaki Desk   |   31 March 2016 7:52 AM GMT
డియర్ గిన్నిస్ రికార్డ్సు..కేసీఆర్ గురించి తెలుసా?
X
తెలంగాణ ప్రాజెక్టులను పలు సమస్యల్లో ఇరికించేవారని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర, పర్యావరణ అనుమతుల సమస్యల్లో ఇరికించేవారని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్‌ కాలువల నిర్వహణలోనూ వివక్ష ఉండేదని ఆయన అన్నారు. సాగర్‌ కుడి కాలువ లిఫ్టు నిర్వహించి - ఎడమ కాలువను వదిలేశారని - ఇది వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. తానెవరినీ విమర్శించడం లేదని, కేవలం నాటి సంఘటనలు ఉటంకిస్తున్నానని మాత్రమే చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యంత ప్రధానమైన ఇరిగేషన్‌ పై దృష్టి సారించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న కృష్ణా - గోదావరి నదుల్లో తాను వేసినన్ని నాణేలు ఎవరూ వేసి ఉండరని ఆయన చెప్పారు. ఆ సంగతి తన డ్రైవర్ బాలయ్యకు తెలుసని... ఆయన తన కోసం జేబులో నాణేలు వేసుకుని వచ్చేవారని గుర్తు చేశారు. దాదాపుగా 35 ఏళ్లుగా బాలయ్యే తనకు డ్రైవర్ గా ఉన్నాడన్నారు.

కృష్ణా - గోదావరి నదులను దాటే తన పర్యటనలకు ముందు బాలయ్య రూపాయి నాణేలు కనీసం పది జేబులో వేసుకుని వచ్చి తనకు ఇచ్చేవాడని.. నదులను దాటేటప్పుడు అక్కడ ఆగడం నదీ ప్రవాహంలో నాణెం వేయడం తమ సంస్కృతి అని కేసీఆర్ చెప్పారు. ఈ క్రమంలో ఆ రెండు నదుల్లో తాను వేసినన్ని నాణేలను మరెవరూ వేసి ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతిసారి నదిలో నాణేలు వేసి తెలంగాణ బీడు భూములను తడపాలని నదీమ తల్లులను మనసారా వేడుకునేవాడినన్నారు. ప్రజలు - దేవుళ్లు - నదీమ తల్లుల చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. ఇప్పుడు వారి దీవెనలతోనే సుభిక్షమవుతుందని ఆకాంక్షించారు. అనంతరం ఆయన స్లైడ్ లు వేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించారు.