Begin typing your search above and press return to search.

కేసీఆర్‌-కోదండ‌రామ్‌ స‌వాల్‌ లో తీర్పు టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:17 AM GMT
కేసీఆర్‌-కోదండ‌రామ్‌ స‌వాల్‌ లో తీర్పు టెన్ష‌న్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు - తెలంగాణ జేఏసీ సార‌థి కోదండ‌రామ్‌ కు మ‌ధ్య న‌లుగుతున్న ప్ర‌జా ప్ర‌యోజ‌నం పాయింట్‌ లో ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపునకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. కోదండ‌రామ్ నేతృత్వంలోని ప‌లువురు తెలంగాణ‌వాదులు వేసిన అడుగు వ‌ల్ల‌ ఈనెల 11వ తేదీ అంటే గురువారం కేసీఆర్‌ కు టెన్ష‌న్ ప‌డే సంద‌ర్భం ఎదుర‌వుతున్న‌ది.

కేసీఆర్ ఆకాంక్షించిన‌ట్లే గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో టీఆర్ఎస్ గెలుపొందింది. సొంతంగా మేయ‌ర్ స్థానాన్ని అధికారికంగా కైవ‌సం చేసుకోనుంది. ఈ నేప‌థ్యంలో 11వ తేదీన ఆ సంబరం జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు అదే రోజున ఛత్తీస్‌ గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో అవ‌క‌త‌వ‌క‌లున్న‌ట్లు గ‌తంలో వ‌చ్చిన ఫిర్యాదుల‌పై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ ఈఆర్సీ) బహిరంగ విచారణ నిర్వహిస్తోంది. ఈ పీపీఏపై పలువురు విద్యుత్‌ రంగ నిపుణులు - రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలకు డిస్కంల ఉన్నతాధికారులు పాక్షిక వివరణలు ఇచ్చారు. ఛత్తీస్‌ గఢ్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అయినా, కాకున్నా యూనిట్‌ కు రూ.2.75 పైసలు నుంచి రూ.3 వరకు ఫిక్స్‌ డ్‌ చార్జీలను చెల్లించకతప్పదని విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు. దానితో పాటు ఛత్తీస్‌ గఢ్‌ విద్యుత్‌ నియంత్రణామండలి తీసుకునే నిర్ణయం మేరకు విద్యుత్‌ సెస్‌ - పంపిణీ చార్జీలు ఇతరత్రా పన్నుల్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది.

వాస్తవానికి ఛత్తీస్‌ గఢ్‌ లోని వార్ధా నుంచి మహేశ్వరం వరకు విద్యుత్‌ లైన్లు వచ్చే ఏడాది (2017)చివరి నాటికి పూర్తవుతాయి. అయితే మొత్తం కారిడార్‌ నిర్మాణం పూర్తికావడాని మరో ఐదేండ్ల వరకు సమయం పడుతుంది. 2017లో అందుబాటులోకి వచ్చే లైన్ల ద్వారా రాష్ట్రానికి కేవలం 200 మెగావాట్ల నుంచి 300 మెగావాట్లు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతుంది. అయినా ఒప్పందం ప్రకారం మొత్తం వెయ్యి మెగావాట్లను సరఫరా చేసినట్టే భావించి తెలంగాణ డిస్కంలు ఫిక్స్‌ డ్‌ చార్జీల రూపంలో ఛత్తీస్‌ గఢ్‌ డిస్కంలకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. రాని విద్యుత్‌ కు (దాదాపు 700 మెగావాట్లు) చార్జీలు ఎందుకు చెల్లిస్తారనే ప్రశ్నకు డిస్కంలు పూర్తిస్థాయి వివరణ ఇవ్వలేదు. ఫిక్స్‌ డ్‌ చార్జీల రూపంలో ఉండే ఈ భారం సంవత్సరానికి దాదాపు రూ.1500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఫిక్స్‌ డ్‌ చార్జీలు చెల్లించక తప్పదని మాత్రం తెలంగాణ డిస్కంలు తమ వివరణలో తేల్చిచెప్పాయి. పీపీఏ కుదిరినప్పుడు వచ్చిన విద్యుత్‌ కు మాత్రమే చార్జీలు చెల్లిస్తామని వాదించిన డిస్కంలు ఇప్పుడు అందుకు భిన్నమైన సమాధానాన్ని ఇవ్వడం గమనార్హం. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ కాకుండా ఎంఓయు రూపంలో ఎందుకు ఒప్పందం చేసుకున్నారనే ప్రశ్నకు కూడా డిస్కంలు స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వలేదు. 'అత్యవసరం' కాబట్టి ఎంఓయు కుదుర్చుకున్నామని మాత్రం పేర్కొన్నారు.

కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా అయితే ఛత్తీస్‌ గఢ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఇచ్చే ధరకన్నా తక్కువ ధరకే విద్యుత్‌ లభ్యమయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సహా తెలంగాణకు చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం మిగులు విద్యుత్‌ ఉన్నదనేది విద్యుత్‌ రంగ నిపుణుల వాదన. 2018 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధిస్తామని, ఆ మేరకు కొత్త థర్మల్‌ కేంద్రాల నిర్మాణం జరుగుతోందని ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆ దశలో 25 ఏల్ల‌ పాటు ఛత్తీస్‌ గఢ్‌ డిస్కంలతో ఒప్పందం ఎందుకనే ప్రశ్నకు కూడా తెలంగాణ డిస్కంలు సమాధానం చెప్పలేదు. 2003 విద్యుత్‌ చట్టం సెక్షన్‌ 64(5) ప్రకారం విద్యుత్‌ కొనుగోలు ధరను వినియోగ రాష్ట్రమైన టీఎస్‌ ఈఆర్‌ సీ నిర్ణయించాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఆ అధికారాన్ని మనకు విద్యుత్‌ ను సరఫరా చేసే ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్ర ఈఆర్‌ సీకి కట్టబెడ్తూ పీపీఏ కుదుర్చుకున్నారు. దీనివల్ల ధర నిర్ణయంలో మన రాష్ట్ర ఈఆర్‌ సీ ప్రమేయం ఏమాత్రం ఉండదు. పొరుగు రాష్ట్రాలు తక్కువ ధరకు విద్యుత్‌ ను ఇస్తామన్నా, తప్పనిసరిగా ఛత్తీస్‌ గఢ్‌ నుంచే విద్యుత్‌ ను కొనుగోలు చేయాలి. లేకుంటే విద్యుత్‌ సరఫరా చేసినట్టు 'భావించి' ఫిక్స్‌ డ్‌ చార్జీలను చెల్లించాలి. అయితే డిస్కంల సమాధానాల్లో సెక్షన్‌ 64(5)ను ఉల్లంఘించినట్టు పరోక్షంగా పేర్కొనడం గమనార్హం.

మరోవైపు ఛత్తీస్‌ గఢ్‌ విద్యుదుత్పత్తి సంస్థలు ఎక్కడి బొగ్గును వినియోగిస్తాయనే దానిపైనా స్పష్టత లేదు. జనరేషన్‌ స్టేషన్‌కు సమీపంలోని బొగ్గు గనుల నుంచి కాకుండా దూర ప్రాంత గనుల నుంచి విద్యుదుత్పత్తి చేస్తే అందుకయ్యే రవాణా చార్జీలను తెలంగాణ డిస్కంలే భరించాలనే షరతును పీపీఏలో పొందుపరిచిన విషయం తెలిసిందే. బొగ్గు వినియోగంపై మన రాష్ట్ర డిస్కంల అనుమతి తీసుకోవాలనే షరతును పీపీఏలో పొందుపర్చలేదు. ఇది కూడా తెలంగాణ డిస్కంలకు ఆర్థికంగా భారంగా మారుతుంది.

మొత్తంగా పై అంశాల‌న్నింటితో వాదిస్తే కేసీఆర్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం త‌ప్ప‌ని తేల‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో 11వ తేదీన ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.