Begin typing your search above and press return to search.

3 గంటల కేసీఆర్ స్పీచ్ ని మూడు ముక్కల్లో చెబితే..?

By:  Tupaki Desk   |   31 March 2016 3:43 PM GMT
3 గంటల కేసీఆర్ స్పీచ్ ని మూడు ముక్కల్లో చెబితే..?
X
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రజాప్రతినిధులతో పాటు.. యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇరిగేషన్ విషయంలో దశాబ్దాలుగా జరిగిన మోసం కళ్లకు కట్టినట్లుగా చెప్పటం.. ఇదంతా సమైక్యపాలనలోనే చోటు చేసుకుందన్న విషయాన్ని స్పష్టం చేయటం కనిపిస్తుంది.

మూడు గంటలకు పైగా అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఒకే అంశంపై నాన్ స్టాప్ గా మాట్లాడటం.. అది కూడా రాజకీయంగా విమర్శలు.. పంచ్ డైలాగులు కాకుండా కేవలం సబ్జెక్ట్ ను మాత్రమే చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఆ చెప్పిన విషయాలన్నీ అందరికి అర్థమయ్యేలా.. సామాన్యుడికి సైతం పూర్తిస్థాయి అవగాహన కలిగేలా చెప్పటం మరో విశేషంగా చెప్పాలి.

మూడు గంటల పాటు ఒక సీఎం నాన్ స్టాప్ గా ఒక విషయాన్ని చెప్పుకుంటూ పోయిన విషయాన్ని పక్కన పెడితే.. కేసీఆర్ చెప్పిన మాటల్ని మూడే మూడు ముక్కల్లో.. లేదంటే మూడు పాయింట్లలో చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు? అన్నది అత్యంత ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే.. అంత భారీ ప్రసంగాన్ని మూడు పాయింట్లలో తేల్చే ప్రయత్నం చేస్తే..

1. వందల ఏళ్ల నుంచి తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ వ్యవస్థ అద్భుతంగా ఉండేది. అలా ఉండే వ్యవస్థ సమైక్యపాలనలో భ్రష్ఠు పట్టించారు. తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు.

2. తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి కటకటకు కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీల దుర్మార్గ పాలన. తెలంగాణకు ద్రోహం చేసి.. ఆంధ్రాకు నీటిని తరలించారు. సరిహద్దు రాష్ట్రాల మాదిరి తెలివిగా వ్యవహరించారు.

3. జరిగిన తప్పుల్ని సరిదిద్దటం. అదంత తేలికైన విషయం కాని నేపథ్యంలో.. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ.. రీడిజైనింగ్ ద్వారా ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వటం.