Begin typing your search above and press return to search.

ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ ను ధ‌ర్నా చౌక్ చేసేస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Jun 2017 5:55 AM GMT
ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ ను ధ‌ర్నా చౌక్ చేసేస్తున్నారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముచ్చ‌ట‌ప‌డి నిర్మించుకున్న నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఇప్పుడు నిర‌స‌న‌ల కేంద్రంగా మారిందా? ప‌ట్టుబ‌ట్టి తొల‌గించిన ధ‌ర్నా చౌక్ కార‌ణంగానే కేసీఆర్‌ ఇర‌కాటంలో ప‌డుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. గతంలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు - ఉద్యోగ సంఘాలు - రాజకీయ పార్టీలు - సామాన్య ప్రజలు ఇందిరా పార్క్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వద్ద ధర్నాలు - ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అక్కడ ధర్నాలకు ప్రభుత్వం అనుమతించడం లేదు. ధర్నాచౌక్‌ ను ఎత్తివేయడంతో ఉద్యోగులు తమ సమస్యల గోడును వెళ్లబోసు కోవడానికి ఆయా వర్గాల ప్రజలు ప్రగతిభవన్‌ ముందు ధర్నాలు చేపడుతున్నారు. దీంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ కాస్త ధ‌ర్నా చౌక్‌ గా మారింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప‌గ్గాలు చేపట్టిన తర్వాత ఓ సంద‌ర్భంలో గులాబీ ద‌ళ‌ప‌తి కే చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడుతూ ఇక ధర్నాలు.. ఆందోళనలు చేపట్టే అవకాశం ఉండదు.. ఉద్యోగులు సామాన్య ప్రజలు తమ సమస్య లను నేరుగా సీఎంకు చెప్పు కునే వీలు కల్పిస్తాం అంటూ ప్ర‌క‌టించారు. ముఖ్యమంత్రి గత కొంతకాలంగా సచివాలయానికి రాకపోవడం - మంత్రులు - అధికారులు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం లేదు. దీంతో సీఎంకు తమ సమస్యలను వినిపించేందుకు నేరుగా ప్రగతిభవన్‌ కు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో అపాయింట్‌ మెంట్ దొర‌క‌ని వ‌ర్గాలు వినూత్న ఆందోళ‌న‌కు దిగుతున్నారు. ఏళ్ల‌ తరబడి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నర్సులు - అంగన్‌ వాడీలు - అప్పుల బాధను తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య యత్నం - తాజాగా గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ ప్రగతిభవన్‌ ముందు ధర్నాలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్న సీఎం కేసీఆర్‌ కనీసం ప్రజా సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని ప్రజాసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు - ప్రజలు సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసభవనం ముందే ధర్నాలు.. ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/