Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటః హ‌రీశ్ బుల్లెట్‌

By:  Tupaki Desk   |   12 Jan 2016 10:35 AM GMT
కేసీఆర్ మాటః హ‌రీశ్ బుల్లెట్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావు రూపంలో రాజుకుంటున్న అసంతృప్తికి చెక్ పెట్టారు. స‌భ వేదిక‌గా, సంద‌ర్భం వ‌చ్చిన‌పుడ‌ల్లా హ‌రీశ్ రావును మెచ్చుకొంటూ బుట్ట‌లో వేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌దైన శైలిలో హ‌రీశ్‌ ను పొగుడుతూ, ఆయ‌నపై జోకులు వేస్తూ కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

మెదక్ జిల్లా దుబ్బాకలో తాను చదువుకున్న పాఠశాల మోడల్ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేసిన కార్య‌క్ర‌మం ఇందుకు వేదిక అయింది. దుబ్బాకలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో తన చిన్ననాటి గురువులు, మిత్రుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అక్షరాలు దిద్దించిన గురువులకు పాదాభివందనం చేశారు. అనంతరం మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ పనులపై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు బుల్లెట్‌ లాంటివాడని ప్రశంసించారు. యువకుడు.. ఉత్సాహంతో పనిచేసే చురుకైన నీళ్ల మంత్రి హరీశ్ అని అన్నారు. వచ్చే రెండేండ్లలో దుబ్బాకకు సాగు నీరు వస్తుంది.. దీంతో ఈ ప్రాంతమంతా బంగారుతునక అవుతుంది. ఆ నీళ్లమంత్రి మీ జిల్లావాడు కావడం మీరు చేసుకున్న అదృష్టం అంటూ హారీశ్ వైపు చూపుతూ అన్నారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ పనులపై మాట్లాడుతూ తాను ఆడుకున్న రెండు చెరువుల‌ను అభివృద్ధి చెందించాల‌ని కోరారు. రెండు చెరువులు అంటే బాగా స్వార్థంతో అడుగుతున్నాను అనుకుంటే..క‌నీసం ఒక్క‌టైన అభివృద్ధి అయ్యేలా చూడాల‌ని కేసీఆర్ అన‌డంతో మంత్రి హ‌రీశ్‌ రావుతో స‌హా అక్క‌డున్న వారిలో న‌వ్వులు పూశాయి.

మొత్తంగా ఇటీవ‌లి కాలంలో జ‌రుగుతున్న కోల్డ్‌ వార్‌ కు చెక్‌పెట్టేలా కేసీఆర్ స‌భ వేదిక‌గా హ‌రీశ్‌ రావును ఐస్ చేసేశార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.