Begin typing your search above and press return to search.

బాబు దుకాణ‌మంటూ కేసీఆర్‌ సెటైర్లు

By:  Tupaki Desk   |   2 Sep 2018 4:41 AM GMT
బాబు దుకాణ‌మంటూ కేసీఆర్‌ సెటైర్లు
X
త‌న నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో తాను సాధించిన తొలి విజ‌యంగా విద్యుత్ సమ‌స్య‌ను అధిగ‌మించ‌టం అని చెప్పుకోవ‌టం త‌ర‌చూ చూస్తుంటాం. కొంగ‌ర్ లో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ఒక రోజు ముందు తెలంగాణ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మానికి విద్యుత్ ఉద్యోగుల‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న విద్యుత్ ఉద్యోగుల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ ప్ర‌భుత్వ తొలి విజ‌యం విద్యుత్ రంగంలోనే సాధించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా విద్యుత్ ఉద్యోగుల‌కు 35 శాతం వేత‌న స‌వ‌ర‌ణ ప్ర‌క‌టించారు. జేఎల్ ఎంల‌కు సంబంధించిన కేసు కోర్టులో ఉంద‌ని.. కేసు విత్ డ్రా చేసుకుంటే మిగిలిన 600 మందిని నియ‌మించుకోవ‌చ్చ‌న్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్తించే హెల్త్ స్కీమ్ ను విద్యుత్ ఉద్యోగుల‌కు కూడా వ‌ర్తింప‌చేస్తామ‌న్న ఆయ‌న‌.. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే నాణ్య‌మైన విద్యుత్ వ‌స్తుంద‌న్నారు. దేశ చ‌రిత్ర‌లో ఏ రాష్టానికి సాధ్యం కాని రీతిలో నిరంత‌ర విద్యుత్ అందిస్తున్న‌ట్లుగా చెప్పి.. ఆ సంద‌ర్భంలో విద్యుత్ సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు.

దీంతో.. ఒక్క‌సారిగా ప్ర‌భాక‌ర్ రావు జిందాబాద్ అంటూ నినాదాల్ని విద్యుత్ ఉద్యోగులు చేశారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ నోట ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.

‘‘ప్రభాకర్‌ రావు గారికి గాలి బాగున్నట్లుంది. సప్పుడు చేయకుండా ఎలక్షన్లో నిలబెడదాం. ఆయన ఒప్పుకొంటే పార్టీకి లాభమయితది’’ అని వ్యాఖ్యానించారు. దాంతో విద్యుత్‌ ఉద్యోగులంతా ‘ప్రభాకర్‌ రావు జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. స‌భ చివ‌ర్లో త‌మ స‌మ‌స్య‌లు తీర్చాలంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొంద‌రు సీఎం కేసీఆర్ ను కోరారు. దీనికి స్పందించిన ఆయ‌న‌.. ఇది చంద్ర‌బాబు పెట్టిన దుకాణ‌మా? అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. ఆ వెంట‌నే స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తామ‌న్న భ‌రోసా ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల స‌భ‌లో కేసీఆర్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.