Begin typing your search above and press return to search.

తన కుడిభుజం గురించి కేసీఆర్ చెప్పారు

By:  Tupaki Desk   |   28 April 2016 4:25 AM GMT
తన కుడిభుజం గురించి కేసీఆర్ చెప్పారు
X
ఒక బలమైన అధినేతకు కుడి.. ఎడమ భుజాల్లాంటి వారంటూ కొంతమంది పేర్లు నిత్యం వినిపిస్తుంటాయి. అయితే.. పుష్కరానికి పైనే తెలంగాణ ఉద్యమాన్ని నడిపి.. గడిచిన రెండేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా తిరుగులేని అధిక్యతతో దూసుకెళ్లే కేసీఆర్ కు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్లు ఎవరన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే అవకాశం కనిపించదు. సీజన్ కు తగ్గట్లుగా ఆయన దగ్గర ఉండే సన్నిహితులు ఇట్టే మారిపోతుంటారు.

అలె నరేంద్ర మొదలు విజయశాంతి వరకూ చూస్తే.. కాలానికి అనుగుణంగా కొందరు ఆయనకు దగ్గరగా.. సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత వారు తెరమరుగు కావటం.. కొత్తవాళ్లు రావటం లాంటివి కనిపిస్తాయి. అదే సమయంలో తనకు క్లోజ్ గా ఉండే వారి గురించి కేసీఆర్ సైతం ప్రత్యేకంగా ప్రస్తావించటం కూడా కాస్త తక్కువే. అలాంటి కేసీఆర్ నోట పొగడ్తల వర్షం కురవటమే కాదు.. తన కుడిభుజం అంటూ పొగిడించుకున్న ఘనత ఎవరికైనా దక్కిందంటే అది మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకే దక్కిందని చెప్పాలి.

కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయనకు క్లోజ్ అయిన వాళ్లు చాలామందే ఉన్నా.. వారిలో ఎంతమంది కంటిన్యూ అవుతారన్నది చాలా పెద్ద ప్రశ్న. అదే సమయంలో.. తనకు సన్నిహితంగా ఉండే వారి గురించి.. వారి గొప్పతనం గురించి కేసీఆర్ పెద్దగా ప్రస్తావించరు. ఒకవేళ ప్రస్తావించినా.. ఆ పొగడ్తలన్నీ పరిమితంగానే ఉంటాయి. కానీ.. ఇందుకు భిన్నగా తుమ్మల వ్యవహారంలో కేసీఆర్ వ్యవహరించారని చెప్పాలి.

కలిసొచ్చే కాలానికి నడిచచచే కొడుకు అన్న చందంగా తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారని.. రాష్ట్ర ముఖ్యమంత్రికి కుడి భుజంగా ఉన్న వ్యక్తి.. రాష్ట్ర సీఎంకు ఆత్మీయుడైన వ్యక్తిగా తుమ్మలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించటం విశేషం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. తుమ్మల నాగేశ్వరరావును విపరీతంగా పొగిడేశారు.

నీతి.. నిజాయితీలకు కేరాఫ్ అడ్రస్ తుమ్మల అంటూ పొగడ్తలు గుప్పించిన కేసీఆర్.. తాజాగా జరుగుతున్న పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. జిల్లా అభివృద్ధి కోసం తుమ్మల శ్రమిస్తారని.. పాలేరు నియోజకవర్గ ప్రజలు సైతం ఊహించని రీతిలో నియోజకవర్గాన్ని తుమ్మల అభివృద్ధి చేస్తారంటూ గొప్పలు చెప్పారు. ఏమైనా కేసీఆర్ నోటి నుంచి ఇంత భారీ పొగడ్తలు పొందిన ఘనత తుమ్మలకే చెల్లుతుందని చెప్పక తప్పదు.