Begin typing your search above and press return to search.

కేసీఆర్ సమర్పించు సరికొత్త ‘ప్రజాదర్బార్’

By:  Tupaki Desk   |   13 Jan 2017 5:49 AM GMT
కేసీఆర్ సమర్పించు సరికొత్త ‘ప్రజాదర్బార్’
X
కొత్తగా ఆలోచించటం.. సరికొత్తగా అమలు చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. చేసింది తప్పా.. ఒప్పా అన్నది పక్కన పెడితే.. తాను టార్గెట్ చేసినోళ్ల మనసుల్ని టోకుగా కొల్లగొట్టటం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పకతప్పదు. తన మనసుకు తగ్గట్లుగా కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి మరీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన ప్రగతి భవన్ లో కొలువు తీరిన ఆయన.. ఇప్పుడు ప్రజాదర్బార్ పేరిట సరికొత్త రాజకీయానికి తెర తీస్తున్నారు.

ఒకేసారి వెయ్యి మందిని కలుసుకునే అవకాశం ఉండేలా పే..ద్ద సమావేశ మందిరాన్ని నిర్మిస్తున్నవేళ.. చాలామంది ఇది అవసరమా? అన్న ప్రశ్నల్ని సంధించారు. ఊరికే ఏదీ చేయరు.. అందులోకి కేసీఆర్ లాంటోళ్లు అస్సలు చేయరన్నది నిజమన్న విషయం మరోసారి తేలిపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించి దాదాపు మూడేళ్లకు కాస్త దగ్గరగా వస్తున్నప్పటికీ.. ప్రజల్ని కలుసుకునే విషయంలో కేసీఆర్ వెనకపడినట్లుగా పలువురు తప్పు పడతారు.

ఆ కొరత త్వరలో తీరిపోతుందని చెబుతున్నారు. సంక్రాంతి పండగ తర్వాత నుంచి వర్గాల వారీగా.. ప్రాంతాల వారీగా ఒకే దఫా వెయ్యేసి మందితో కేసీఆర్ నిర్వహించే ప్రజాదర్బార్ రాజకీయ లెక్కల్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది. తాను సిద్ధం చేసిన జనహిత భవన్ లో నిత్యం ప్రజాదర్బార్ ను నిర్వహిస్తూ.. గ్రామాల నుంచి నగరాల వరకూ ప్రణాళిక ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజల్ని తన నివాసానికి పిలిపించుకొని.. దర్బార్ నిర్వహించి.. తన మాటలతో వచ్చిన వారి మనసుల్ని దోచుకునే ప్రోగ్రాం త్వరలో షురూ చేసేందుకు వీలుగా కేసీఆర్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

వివిధ కులాలు.. వర్గాలతో పాటు.. తమ సమస్యలు.. బాధలు చెప్పుకునేందుకు వచ్చే ఆపన్నులను సైతం దర్బార్ సందర్భంగా కలుసుకొని వారికి సాంత్వన కలిగేలా చేస్తారని చెబుతున్నారు. పిలిచి మాటలు చెప్పి పంపిస్తే కేసీఆర్ మార్క్ ఏముంది? అందుకే.. ఆయన తనదైన శైలిలో ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

వివిధ జిల్లాల నుంచి ప్రజాదర్బార్ కు వచ్చే వారికి రానుపోను ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు.. వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టించటమే కాదు.. బంగారు తెలంగాణ లక్ష్య సాధన ఏవిధంగా చేపట్టాలన్న విషయం మీద తయారు చేసిన డాక్యుమెంటరీలు.. వీడియో క్లిప్పింగ్ లు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్లుప్రదర్శిస్తారు. అంతిమంగా సీఎం కేసీఆర్ చెప్పే మాటలతో దర్బార్ ముగుస్తుంది. దర్బార్ కు వచ్చిన ప్రతిఒక్కరిని టీఆర్ఎస్ వీరాభిమానిగా తయారు చేయటమే కాదు.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగేలా ప్రణాళిక సిద్ధం చేసిన తీరు చూస్తే.. కేసీఆరా మజాకానా? అన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/