Begin typing your search above and press return to search.

ఎన్నికల కోసం కేసీఆర్ ప్రీ ప్లాన్.. ఏకంగా వెయ్యి కోట్లు..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 4:03 AM GMT
ఎన్నికల కోసం కేసీఆర్ ప్రీ ప్లాన్.. ఏకంగా వెయ్యి కోట్లు..!
X
తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. గత రెండు పర్యాయాలు టీఆర్ఎస్ గా ప్రజలను ఆకర్షించింది. ఇప్పుడు బీఆర్ఎస్ తో గులాబీ నాయకులు జనంలోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలను ఆకర్షించే పథకాలను ప్రవేశపెడుతున్నాడు. తాజాగా 1000 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నిధులతో తండాల్లోని రోడ్లను మండల కేంద్రానికి లింక్ చేయనున్నారు. దీంతో ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్న తమకు పరిష్కారం లభించినట్లయిందని గిరిజనులు, ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చి 9 ఏళ్లు గడిచినా ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల నిధులు విడుదల చేయడంపై కేసీఆర్ ఎన్నికల ప్రీ ప్లాన్ అని చర్చించుకుంటున్నారు.

గిరిజన తండాల రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ట్రైబల్ వెల్ఫేర్, రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లు, పంచాయతీ అధికారులు టీంలుగా ఏర్పడి జిల్లాల వారీగా సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిధులు కూడా విడుదలయ్యాయి. ఇందులో 600 కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ కు, 300కోట్లు ఆర్అండ్ బీ, మరో 100 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించారు. జిల్లాల వారీగా రోడ్లను విభజించి పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

తండావాసులు రోడ్ల సమస్యను ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు ఇప్పటికీ కొండ ప్రాంతాల నుంచే నడుస్తున్నారు. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆపద సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక మండల కేంద్రానికి వచ్చేందుకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో కాలినడకనే వచ్చే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ సమస్యపై ఎందరో నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇస్తున్నారే తప్పా ఎవరూ పట్టించుకోలేదు. కొందరు తాత్కాలికంగా రోడ్లను నిర్మించి ఓట్లను రాబట్టారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా గిరిజనులు అనేక సార్లు విన్నవించారు. కానీ సమస్య పరిస్కారం కాలేదు. దీంతో ఆ పార్టీపై తండాల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినందుకు కాస్త హర్షం వ్యక్తం చేసినా వాటి అభివృద్ధికి ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతో మరోసారి అసంతృప్తితో ఉన్నారు. ఇది గమనించిన కేసీఆర్ తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

తండాల్లో ఎలాంటి సమస్యలున్న వెంటనే పరిస్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటిలో ముందుగా రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నారు. ఆ తరువాత బస్సు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. అయితే కేసీఆర్ గిరిజన ఓట్లను రాబట్టుకునేందుకు నిధులు కేటాయించారని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల లోపే ఈ పనులు పూర్తి చేస్తే తాము కూడా హర్షిస్తామని కొందరు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తాడో చూడాలి...


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.