Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందంటే..?

By:  Tupaki Desk   |   7 April 2019 8:08 AM GMT
కేసీఆర్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందంటే..?
X
పోల్ మేనేజ్ మెంట్ అన్నంతనే టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు వస్తారు. కానీ.. బాబుకు పాఠాలు నేర్పేలా ఆయన ఒకప్పటి శిష్యుడు.. టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల ఏదైనా పక్కా ప్లానింగ్ చేయటం ఒక ఎత్తు అయితే.. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చేయటం కేసీఆర్ కున్న అదనపు బలంగా చెప్పాలి. ఎన్నికలు ఏవైనా విజయం గులాబీ కారుదేనన్న ధీమాను తెప్పించటంలో ఆయన సక్సెస్ అయ్యారు.

కారు.. సారు.. పదహారు అంటూ తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో 16 సీట్లపై గురి పెట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన ఒక్క సీటు కూడా తనకు జిగిరీ స్నేహితుడైన అసద్ కు వదిలేసిన వైనాన్ని మర్చిపోకూడదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబు సెంటిమెంట్ కేసీఆర్ కు రక్షగా మారిందన్న మాట నేపథ్యంలో.. తాజా ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా ఎన్నికల్లో తాము అంచనా వేసుకున్నట్లుగా 16 సీట్లు తమ ఖాతాలోకి వచ్చేస్తాయన్న మాట చెబుతున్నప్పటికీ.. అదంత ఈజీ కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గడిచిన ఐదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం మాదిరి.. కేసీఆర్ తీరుపై యావత్ తెలంగాణలో వ్యతిరేక భావనలు అంతకంతకూ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విపక్షం లేకుండా చేయాలన్న తీరుపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని.. తాజా ఎన్నికల ద్వారా సారుకు షాకివ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

మరి.. ఈ వాదన ఎంత వరకూ నిజమో తెలీదు కానీ.. ఈ తరహా నెగిటివ్ కామెంట్స్ కేసీఆర్ చెవిన పడటమే కాదు.. ఆయన ఫుల్ అలెర్ట్ అయ్యారని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పోలింగ్ ప్లానింగ్ విషయంలో ఆయన కొత్త తరహా వ్యూహాల్ని తెర మీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో బూత్ కమిటీలు.. పోలింగ్ ఏజెంట్ల విషయంలోనూ కేసీఆర్ నియమిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరి కాకుండా.. ఈసారి నేరుగా అధిష్ఠానం కిందిస్థాయి నిర్ణయాల్ని తీసుకోవటం విశేషం.

గతానికి భిన్నంగా బూత్ ల పరిధిలోని ముఖ్య కార్యకర్తలు.. నేతల వివరాల్ని తెప్పించుకున్న టీఆర్ ఎస్ అధినాయకత్వం.. వారి వివరాల్ని క్రాస్ చెక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 33 వేల వరకూ పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీటికి సంబంధించిన కమిటీలు.. ఏజెంట్లకు సంబంధించిన నియామక ప్రక్రియను గడిచిన వారంగా చెక్ చేయటం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సేకరించిన జాబితాలో చురుకైన.. అనుభవం ఉన్న వారిని గుర్తించి.. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఇంత కిందిస్థాయి మీద ఇప్పటివరకూ మరే పార్టీ ఫోకస్ చేయలేదని.. దీని ప్రభావం తుది ఫలితాల మీద తప్పక ఉంటుందని చెబుతున్నారు. కేసీఆరా మజాకానా?