Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక రిజల్ట్ మీద కేసీఆర్ జోస్యమేంటి?

By:  Tupaki Desk   |   24 Nov 2015 4:09 AM GMT
ఉప ఎన్నిక రిజల్ట్ మీద కేసీఆర్ జోస్యమేంటి?
X
ఉప ఎన్నిక ఫలితం మీద చాలానే విశ్లేషణలు ఉన్నాయి. ఎవరు ఏమనుకున్నా అది ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్లేషణ ఏమిటన్నది కాస్తంత ఆసక్తికరమే. మరి.. ఉప ఎన్నిక ఫలితంపై ముఖ్యమంత్రి ఏమని ఫీలవుతున్నారు? తుది ఫలితం ఎలా ఉంటుందని భావిస్తున్నారన్న విషయంలోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనసులోని మాటను పార్టీ ఎంపీలతో పంచుకున్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఎలా వ్యవహరించాలన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉప ఎన్నికల ఫలితాల అంశం వారి మాటల్లో వచ్చింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికల్లో మెజార్టీ తగ్గుతుందని అనుకున్నామని.. కానీ పోలింగ్ జరిగిన తీరు చూస్తే.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వచ్చిన మెజార్టీనే వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

‘‘నా అంచనా ప్రకారం 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థికి వచ్చినంత మెజార్టీనే ఈసారి వస్తుంది. నా అంచనా ప్రకారం అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకపోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీకి తెలంగాణలో తన సత్తా ఏమిటో తెలిసిరావటం ఖాయమన్న భావనను కేసీఆర్ వ్యక్తం చేశారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో ఏ పార్టీ ముఖ్యమన్న విషయం బీజేపీ అర్థం కావటం ఖాయమని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. బ్రహ్మాండమైన వ్యూహకర్తగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వరంగల్ ఉప ఎన్నికల్లో ఎంతవరకు నిజం అవుతుందన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుందని చెప్పాలి.