Begin typing your search above and press return to search.

బాబు ఓడినా కేసీఆర్ లెక్క తప్పినట్లే.. ఎలానంటే?

By:  Tupaki Desk   |   9 April 2019 4:51 AM GMT
బాబు ఓడినా కేసీఆర్ లెక్క తప్పినట్లే.. ఎలానంటే?
X
ఎన్నికల సందర్భంగా వచ్చే ఫలితాలపై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసే వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్నికలు ఏవైనా ఆయన చెప్పే లెక్కలు దాదాపు నిజమయ్యే పరిస్థితి. అయితే.. ఇదంతా తెలంగాణ వరకు మాత్రమే. ఏపీ విషయంలో ఆయన చెప్పిన లెక్కలన్నీ తప్పలు కావటం తరచూ జరుగుతుండేదే. ఏపీలో బాబు వ్యతిరేక గాలులు వీస్తున్న మాట నిజమే అయినా.. టీడీపీ.. జగన్ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇలాంటి వేళ వచ్చే ఫలితం మీద అంచనాలు అంత ఈజీ కాదు.

అయితే.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కేసీఆర్.. ఏపీ ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని చెప్పాలి. బాబు ఓటమి ఖాయమన్న మాట వరకూ ఓకే కానీ.. డిపాజిట్లు కూడా రావంటూ కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని చెప్పాలి.

బాబుకు.. కేసీఆర్ కు మధ్య నడుస్తున్న పంచాయితీ తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో బాబు ఓటమిని కోరుకుంటున్న కేసీఆర్.. జగన్ గెలవాలని ఆశిస్తున్నారు. తాను.. జగన్ మోహన్ రెడ్డి ఇద్దరం కలిసి.. కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేశారు. ఎన్నికల వేళ బాబు పరిస్థితి బాగోలేదన్న మాట సర్వత్రా వినిపిస్తున్న వేళ.. అదే మాటను తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్.

బాబు ఓటమి ఖాయమని చెబితే సరిపోయే దానికి.. మోతాదు మించిన ఉత్సాహంతో బాబుకు డిపాజిట్లు రావన్న మాటను చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మాట.. ఏపీ ఓటర్లలో భావోద్వేగానికి గురి చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి వేళ.. ఇంతవరకూ ప్రదర్శించిన సంయమనాన్ని ప్రదర్శిస్తే బాగుండేది. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో జగన్ రెడ్డి గెలుపు ఖాయమన్న మాటను చెప్పే క్రమంలో తొందరపడి బాబుకు డిపాజిట్లు రావని తేల్చేశారు.

రేపొద్దున బాబు ఓడినా.. డిపాజిట్లు రానంత దారుణమైన ఓటమి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలాంటి వేళ.. బాబు ఓడినా.. కేసీఆర్ చెప్పిన జోస్యం నిజం కానట్లే అవుతుంది. ఓడిన తర్వాత కేసీఆర్ మాటల్ని ఇంత లోతుగా గుర్తుంచుకునే వారెవరు? అన్న మాటలో నిజం ఉన్నా.. కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు ఏపీ ప్రజల్ని అంతో ఇంతో ప్రభావితం చేయటం ఖాయమని చెప్పక తప్పదు. నిన్నటి వరకూ వ్యతిరేకించిన హోదా.. పోలవరంపై మాట మార్చేయటం.. ఏపీకి సానుకూలంగా ఉంటామన్న కేసీఆర్ మాటల్లోని మర్మాన్ని ఏపీ ఓటర్లు గుర్తిస్తే మాత్రం.. ఫలితాలు అనూహ్యంగా మారతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.