Begin typing your search above and press return to search.

ఈ సారి..హ‌రీశ్‌ నే న‌మ్ముకున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   5 Sep 2018 11:50 AM GMT
ఈ సారి..హ‌రీశ్‌ నే న‌మ్ముకున్న కేసీఆర్‌
X
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముంద‌స్తు రూపంలో...మరోసారి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారయ్యింది. శ్రావణమాసం అన్ని మంచి పనులకు శ్రేష్ఠమ‌ని వేదపండితులు చెప్తుండ‌టాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ శుక్రవారం (ఈ నెల 7వ తేదీన) ప్రజా ఆశీర్వాద సభ పేరిట హుస్నాబాద్ నుంచి సభలను ప్రారంభించనున్నారు. అయితే ఇంత‌టి కీల‌క స‌భ‌కు కేసీఆర్ సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది ఎవ‌రికంటే... త‌న త‌న‌యుడు కేటీఆర్‌ కు కాదు. మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావుకు.

టీఆర్ ఎస్ పార్టీలో ముందు - త‌ర్వాత తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశం అయిన ఎపిసోడ్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌. స‌భ ద్వారా ఏం చెప్ప‌నున్నార‌నే ఆస‌క్తి ముందు వ్య‌క్త‌మైతే...స‌భ ఇలా నీరుగారిపోయిందేంట‌నే అనుమానం అనంత‌రం పార్టీ శ్రేణుల నుంచే వ్య‌క్త‌మైంది. 25 లక్ష‌ల‌మంది హాజ‌రుతో అట్ట‌హాసంగా నిర్వ‌హించాల‌నుకున్న ఈ స‌భకు మంత్రి కేటీఆర్ సార‌థ్యం వ‌హించారు. అన్నీ తానై ఆయ‌న నిర్వ‌హించారు. అయితే, జ‌న‌సమీక‌ర‌ణలో పూర్తి వైఫ‌ల్యం చెందారు. అదే స‌మ‌యంలో ఈ స‌భకు మంత్రి హరీశ్‌ రావును పూర్తిగా దూరం పెట్టేశారు. ఇలా వివిధ కార‌ణాలు ఏవైనా ప్ర‌గ‌తి నివేద‌న టీఆర్ ఎస్ శ్రేణుల‌ను అప్‌ సెట్ చేసిందనేది నిజం. ఈ నేప‌థ్యంలో నాలుగున్నరేళ్ల‌ పాలనపై ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రజల ఆశీర్వాద సభల కార్యక్రమం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం (ఈ నెల 7న) హుస్నాబాద్‌ లో తొలి బహిరంగసభలో ప్రసంగించనుండటంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బాధ్య‌త‌లు ఈ ద‌ఫా త‌న త‌న‌యుడికి కాకుండా...మేన‌ల్లుడు - మాస్ లీడ‌ర్ అయిన హరీశ్‌ రావుకు అప్ప‌గించారు.

మంగ‌ళ‌వారం హరీశ్‌ రావును త‌న ఫాంహౌస్‌ కు పిలిపించిన కేసీఆర్ ఈ సంద‌ర్భంగా హుస్నాబాద్ స‌భ గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌రుగుతున్న మొట్ట‌మొద‌టి మ‌రియు కీల‌క స‌భ నేప‌థ్యంలో హ‌రీశ్‌ను క‌సీఆర్ న‌మ్ముకున్నారు. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన హరీశ్‌ రావు సభ కోసం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పక్కనున్న మైదానాన్ని ఎంపిక చేశారు. వెంటనే పనులను ప్రారంభించారు. సిద్దిపేటలో హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి జనసమీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 7న మధ్యాహ్నం నిర్వహించే బహిరంగసభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సుమారుగా 50 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనసమీకరణలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని మండలాలకు ఎమ్మెల్యేలతోపాటు పార్టీ సీనియర్ నాయకులను ఇంచార్జీలుగా నియమించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు హరీశ్‌ రావు - కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలకు మంత్రి ఈటల ఇంచార్జులుగా వ్యవహరిస్తారు. ఇలా డైన‌మిక్‌గా త‌క్ష‌ణ‌మే స్పందించ‌డం వ‌ల్లే...టీఆర్ఎస్ ముఖ్యులు ఎంత ప‌క్క‌న‌పెట్టాల‌ని చూసినా...హ‌రీశ్ త‌న స‌త్తాతో పార్టీకి ట్ర‌బుల్ షూట‌ర్‌ గా నిలుస్తున్నార‌ని అంటున్నారు.