Begin typing your search above and press return to search.

కూతురు కవితకు పెద్ద బాధ్యతిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   18 Sep 2018 11:27 AM GMT
కూతురు కవితకు పెద్ద బాధ్యతిచ్చిన కేసీఆర్
X
తెలంగాణలో ముందస్తు వేడి రాజుకుంది. కేసీఆర్ వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు కూడా వివిధ బాధ్యతలు అప్పగించేస్తున్నారు. ఇప్పటికే కొడుకు కేటీఆర్ ను ఎన్నికల ప్రచారం, సభలు, పార్టీ కార్యక్రమాల వ్యవహారాలను చూసుకోవాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.. ఇక హరీష్ కు పలు నియోజకవర్గాలను కేటాయించి ప్రచారం చేయాలని చెప్పారట.. ఇప్పుడు తాజాగా తన కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితకు కీలక బాధ్యతలు అప్పగించారు. తండ్రి అప్పజెప్పిన బాధ్యతను ఆగమేఘాల మీద కవిత మొదలు పెట్టేసిందట..

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారింది. రాజకీయ పార్టీలన్నీ ఈ సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీ గెలిచేందుకు సోషల్ మీడియాను బాగా వాడుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ చూపు కూడా సోషల్ మీడియాపై పడింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను ఎంపీ కవితకు అప్పజెప్పినట్టు తాజా సమాచారం.

కవిత రంగంలోకి దిగింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయ్యేలా మానిటరింగ్ మొదలుపెట్టిందట.. దీనికోసం ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తులను కూడా నియమించినట్టు సమాచారం.

సోషల్ మీడియాలో కవిత యమ యాక్టివ్ గా ఉంటారు కాబట్టే.. ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకొని అప్ లోడ్ చేయాల్సిందిగా టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలను - కార్యకర్తలను ఎంపీ కవిత ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలపై కూడా ప్రచారం చేయాలని ఎంపీ ఆదేశించారట.. ప్రతి నియోజకవర్గంలోనూ కవిత పర్యటించి అక్కడి అభివృద్ధిపై సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేయనున్నట్లు సమాచారం.