Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటః పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తే కేసులే

By:  Tupaki Desk   |   19 May 2016 11:53 AM GMT
కేసీఆర్ మాటః పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తే కేసులే
X
సుదీర్ఘ కాలం త‌ర్వాత పాలేరు ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌యం నేప‌థ్యంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు కృతజ్ఞ‌త‌లు తెలుపుతూ ప్ర‌తిప‌క్షాల తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. పాలేరులో గెలుపు ద‌రికి చేర్చిన ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాడండి తప్పుకాదు.. కానీ ప్రభుత్వంపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని కేసీఆర్ అన్నారు. తాను సీఎం అయిన ఐదో రోజు నుంచి నేటి వరకు కొన్ని సందర్భాలలో ఎవరికీ వారుగా, సామూహికంగా తనపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పిచ్చి ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.ప్రభుత్వం పనులు చేస్తోంటే ప్రతీది అక్రమేననే రీతిలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు. ఆరోపణలు చేసేవారు రుజువు చేయాలన్నారు. ఇకపై అసత్య ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా కేసులు పెడతామని కేసీఆర్ హెచ్చరించారు. ఆ కేసులు ఎలా ఉంటాయంటే తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా ఉంటాయని వివరించారు. వెకిలిమకిలి ఆరోపణలు చేస్తే చూస్తూ సహించబోమని కేసీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ఆయ‌న కోరారు.

పాలేరు ప్రజలు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో ప్రభుత్వం మరింత ముందుకు పోతుందని తెలిపారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి దిశగా అడుగులు వేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గత రెండేళ్ల నుంచి టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఏకపక్షంగా గెలిపిస్తోన్నారని కేసీఆర్‌ వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపుడు అవినీతి పనులు చేసిందెవరో ప్రజలకు తెలుసన్నారు. అవన్నీ మరిచిపోయి టీఆర్‌ఎస్‌పై అవాకులుచెవాకులు పేలడం సరికాదన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు ప్రజల ముందు అపహాస్యంపాలు కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొత్తగా వచ్చిన కే లక్ష్మణ్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్రం ఖర్చు చేయడంలేదని ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడనే చందంగా ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడటం సరికాదన్నారు. లక్ష్మన్ అజ్ఞానికి చింతిస్తున్నానన్నారు.మనకు కరువు నివారణకు రూ.3 వేల కోట్లు కావాలని కోరితే ఇచ్చింది రూ.7 వందల కోట్లని తెలిపారు. తాను మొన్న ఢిల్లీ వెళ్లినపుడు స్వయంగా ఈ విషయాన్నే ప్రధానికి చెప్పానని తెలిపారు.

సీలింగ్ లేకుండా ఇంటిలో ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నామని వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, లక్ష్మన్ తెలంగాణకు ఏదైనా చేయాలనుకుంటే ఒక జాతీయహోదా ప్రాజెక్టును తీసుకురావాలని సవాలు విసిరారు. దీంతో తెలంగాణలో శాశ్వత కరువు నివారణ అవుతుందని అన్నారు. అందరూ తామే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయమని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరు ప్రత్యామ్నయమో ప్రజలు చెబుతారని తెలిపారు.