Begin typing your search above and press return to search.

సుదీర్ఘ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   28 Jan 2016 11:54 AM GMT
సుదీర్ఘ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏం చెప్పారు?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాస్తంత చిత్ర‌మైన మ‌నిషి. చాలా విష‌యాల్లో ఆయ‌న ఎంతో తెలివిగా.. ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఎప్పుడైనా మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తే.. మ‌హా అయితే ప‌ది ప్ర‌శ్న‌లు.. లేదంటే ఇర‌వై ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఇస్తారు. కానీ.. ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌త్యేక స‌మ‌యాల్లో ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తే మాత్రం వంద‌ల ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం క‌ల్పిస్తారు. అడిగినోడికి అడిగిన‌న్ని స‌మాధానాల‌న్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హారం ఉంటుంది.

మామూలు స‌మ‌యాల్లో క‌ర్ర కాల్చి వాత పెట్టిన‌ట్లుగా మాట్లాడే కేసీఆర్ ఎన్నిక‌ల్లాంటి ప్ర‌త్యేక స‌మ‌యాల్లో ఓపిగ్గా..శాంతంగా.. ప్ర‌తి ప్ర‌శ్న‌కు వివ‌ర‌ణ ఇచ్చిన తీరులో స‌మాధానాలు చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. తాను చెప్పాల్సిన విష‌యాల్ని సుదీర్ఘంగా చెప్పే ఆయ‌న‌.. మీడియా ప్ర‌తినిధులు అడిగే ప్ర‌తి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. దాదాపు రెండు గంట‌ల‌కు పైగా సాగిన ఆయ‌న మీడియా స‌మావేశంలో కేసీఆర్ చాలానే చెప్పారు.
మూడు ముక్క‌ల్లో కేసీఆర్ ఎం చెప్పారో చెప్పాల్సి వ‌స్తే.. చాలా చేశాం.. చాలా చేస్తున్నాం.. చాలా చేయాల్సి ఉంది.

అందుకే.. చాలా చేస్తున్న మాకు మీరంతా చాలాబాగా ఓట్లు వేయాల‌ని చెప్పేశారు. ఆలోచించి ఓట్లు వేయాల‌ని సున్నితంగా చెబుతూనే.. హైద‌రాబాదీయులంద‌రికి సంక్షేమ ఫ‌లాలు అందిస్తామ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.
కేసీఆర్ అన్న వెంట‌నే చురుకు పుట్టించే మాట‌లు.. భావోద్వేగాల్ని ట‌చ్ చేసే విష‌యాలు ఉండాలి క‌దా అన్న డౌట్ రావొచ్చు. కానీ.. జ‌రుగుతున్న‌ది గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ని.. అందులో రెచ్చ‌గొట్టుడు మాట‌ల కంటే స‌ర్దిచెప్పుడు విధానానికే న‌గ‌ర ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌న్న విష‌యం కేసీఆర్ కు తెలుసు. అందుకే.. హైద‌రాబాద్ ను తాను ఏవిధంగా డెవ‌ల‌ప్ చేయాల‌నుకుంటున్న రంగుల సినిమాను చూపించారు.

ఇన్ని మాట‌లు చెబుతున్నాన‌ని అనుకోవ‌ద్దు.. నా మాట‌ల్ని మీరు న‌మ్మోచ్చంటూ.. తాను తెలంగాణ తెస్తాన‌ని చెప్పి.. తీసుకొచ్చాన‌ని.. క‌రెంటు స‌మ‌స్య‌ను అధిగ‌మించాన‌ని చెప్పిన ఆయ‌న‌.. హైద‌రాబాద్ న‌గ‌ర రూపు రేఖ‌లు మార్చేందుకు బ్రిక్స్ బ్యాంక్ నుంచి తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు పూచీక‌త్తు కింద 25వేల కోట్లు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యాన్ని చెప్పారు.

అంత డ‌బ్బు తెచ్చి ఏం చేస్తార‌న్న ప్ర‌శ్న వేయ‌కుండానే.. మ‌ల్టీ ఫ్లైఓవ‌ర్లు.. తాగునీరు.. చ‌క్క‌టి డ్రైనేజీ.. విశాలమైన రోడ్లు.. న‌గ‌రం న‌లువైపులా బ‌స్సు స్టేష‌న్లు.. ఇలా చాలానే చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ లాంటి వ్య‌క్తి మ‌రీ అంత సాదాగా మాట్లాడ‌తారా? విమ‌ర్శ‌ల మోత పుట్టించ‌రా? విప‌క్షాల మీద విరుచుకుప‌డ‌రా? అన్న సందేహాలు అక్క‌ర్లేదు. ఎందుకంటే.. దానికి ఆయ‌న వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రించారు. 60 ఏళ్ల లెక్క తీసి అందులో 40 ఏళ్లు కాంగ్రెస్‌.. 20 ఏళ్లు తెలుగుదేశం కింద‌నే జీహెచ్ ఎంసీ ఉంద‌ని.. ఇప్పుడు చాలా చేస్తామ‌ని చెబుతున్నోళ్లు అప్పుడెందుకు చేయ‌లేదంటూ లా పాయింట్ తీశారు.

ఇక‌.. బాబు గురించి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న అభివృద్ధి చేయాల్సిన న‌గ‌రాలు ఏపీలో చాలానే ఉన్నాయ‌ని.. చేతి నిండా ప‌ని ఉంద‌ని.. అవ‌న్నీ వ‌దిలేసి తెలంగాణ‌కు వ‌చ్చుడేంటో అర్థం కాదంటూనే.. బాబు ప్ర‌చారం చేయ‌ట‌మే వృధా ప్ర‌యాస‌గా తేల్చేశారు. గ్రేట‌ర్ లో బాబు ప్ర‌చార‌మే అన‌వ‌స‌రంగా తేల్చేసిన ఆయ‌న‌.. ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారం చేయ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు.

ఇక‌.. కేంద్రం గురించి కూడా ప్ర‌స్తావించి.. మోడీ తీరును త‌ప్పు ప‌డుతూ తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా గుస్సా ప్ర‌ద‌ర్శించారు. సుదీర్ఘంగా సాగిన కేసీఆర్ మీడియా స‌మావేశంలో కొస‌మెరుపు ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. చివ‌ర‌గా త‌న‌ను చాలా ప్ర‌శ్న‌లు అడిగి.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చాలా అంశాల మీద అవ‌గాహ‌న క‌లిగేలా చేసినంద‌కు థ్యాంక్స్ చెప్పిన ఆయ‌న‌.. మీడియా స‌మావేశం ద్వారా మంచిగా ప్ర‌చారం జ‌రిగే అవ‌కాశం క‌ల్పించార‌న్న సంతృప్తిని వ్య‌క్తి చేశారు. చివ‌ర‌గా.. ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌న్నింటిని స్వ‌యంగా చూస్తున్నారు కాబ‌ట్టి.. మీడిమా మిత్రులంతా కూడా టీఆర్ ఎస్‌ కే ఓట్లు వేయాలంటూ ముక్తాయించారు. ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రుల్ని కూడా ఓట్లు అడిగే చ‌తుర‌త కేసీఆర్‌కే చెల్లుతుందేమో.