Begin typing your search above and press return to search.

మరోసారి కరెక్ట్ అయిన కేసీఆర్ జోస్యం

By:  Tupaki Desk   |   11 Feb 2020 7:00 AM GMT
మరోసారి కరెక్ట్ అయిన కేసీఆర్ జోస్యం
X
ఎన్నికలు ఏమైనా సరే.. దానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే విశ్లేషణ దాదాపుగా నిజమయ్యే పరిస్థితి.ఎన్నికల వేళలో.. తనదగ్గర ఉన్న అంచనాల్ని ఆయన అప్పుడప్పుడు వెల్లడిస్తుంటారు. 2018 చివర్లో అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. తమ పార్టీ వంద సీట్లకు పైనే గెలుస్తుందని చెప్పటం.. వచ్చిన ఎన్నికల ఫలితాలు అందుకు దగ్గరగా ఉండటం తెలిసిందే. గత ఏడాది మేలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ జోస్యం చెప్పినప్పుడు.. చాలా మంది కొట్టి పారేశారు.

కానీ.. చివరకు ఫలితాలు చూసినప్పుడు కేసీఆర్ చెప్పిందే జరిగింది. తాజాగా వెల్లడవుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ కేసీఆర్ చెప్పిన మాటలే నిజమైన పరిస్థితి. తెలంగాణలో జరిగిన పుర ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించిన వేళ.. కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రెండు వారాల ముందే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని.. దీనికి సంబంధించిన సర్వే రిపోర్టు తన దగ్గర ఉందని చెప్పారు. తాను పక్కాగా లెక్కలు కట్టిన తర్వాతే ఫలితం గురించి చెబుతున్నట్లు గా ఆయన చెప్పారు. ఇదంతా చూస్తే.. కేసీఆర్ చెప్పినట్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటం గమనార్హం. ఎన్నికలకు సంబంధించిన సర్వే ఫలితాల విషయంలో కేసీఆర్ దగ్గర ఉండే రిపోర్టు వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్న మాటకు మరోసారి బలం చేకూరినట్లైందని చెప్పాలి.