Begin typing your search above and press return to search.

హైకోర్టు విభజనపై కేసీఆర్ ఢిల్లీలో ధర్నా

By:  Tupaki Desk   |   28 Jun 2016 5:09 AM GMT
హైకోర్టు విభజనపై కేసీఆర్ ఢిల్లీలో ధర్నా
X
తాను కోరుకున్నట్లు జరగాలన్న పట్టుదలతో వ్యవహరించే అధినేత తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని తాను అనుకున్నట్లు జరుగుతూ.. అన్ని వ్యవస్థలు తనకు అనుగుణంగా వ్యవహరిస్తున్న వేళ.. కొన్ని కొన్ని అంశాలు తనకు మింగుడుపడని రీతిలో వ్యవహరించే ధోరణి ఎవరికైనా అసంతృప్తికి గురి చేయటం ఖాయం. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును చూస్తే.. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఉన్నట్లుగా కనిపిస్తోంది.

అసాధారణంగా..దేశ చరిత్రలోనే తొలిసారి 120 మంది జడ్జిలు రోడ్ల మీదకు రావటం.. న్యాయం కావాలని డిమాండ్ చేయటం.. గవర్నర్ అధికార నివాసమైన రాజ్ భవన్ కు నిరసన ప్రదర్శనగా వెళ్లటం.. వారిని పోలీసులు అడ్డుకోవటం లాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవటం.. వీటిపై సీరియస్ అయిన ఉమ్మడి కోర్టు.. నిరసన చేపట్టిన తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్ష.. ప్రధానకార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసిన అంశాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.

విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన.. జడ్జిల నియామకంపై నడుస్తున్న రచ్చపై సీరియస్ గా ఉన్న కేసీఆర్.. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టాలని భావిస్తోన్నట్లు విశ్వసనీయ సమాచారం. తాము కోరినట్లుగా హైకోర్టు విభజన పూర్తి చేయకుండా జాప్యం చేయటంపై కేసీఆర్ గుస్సాగా ఉన్న విషయంలో విదితమే. తెలంగాణ పట్ల ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. తాజా పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరిపారు.

ఈ అంశంపై తగిన వ్యూహాన్ని సిద్దం చేసిన ఆయన.. తాజాగా చోటు చేసుకున్న అన్ని అంశాలపై గంపగుత్తగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. తన సంచలన నిర్ణయంతో కేంద్రానికి షాక్ ఇవ్వటంతో పాటు.. ఒత్తిడిని పెంచాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. జంతర్ మంతర్ వద్ద తాను చేపట్టాలని భావిస్తున్న నిరసన దీక్షపై ఒకట్రెండు రోజుల్లో వివరాలు వెల్లడి కావొచ్చు. ఈ ధర్నాలో తనతో పాటు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్.. హైకోర్టు విభజన.. జడ్జిల నియామకం లాంటి అంశాలపై ఢిల్లీ రోడ్డు మీద నిరసన దీక్ష చేపడితే అదో సంచలన అంశంగా మారుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.