Begin typing your search above and press return to search.

బంగారు తెలంగాణ రాత్రికి రాత్రికి కాదు: కేసీఆర్‌

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:44 AM GMT
బంగారు తెలంగాణ రాత్రికి రాత్రికి కాదు: కేసీఆర్‌
X
ఆణిముత్యాల్లాంటి మాట‌ల‌కు వేదిక అవుతోంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు. ఈ వ‌ర్షాకాల స‌మావేశాలు ఏ ముహుర్తంలో మొద‌ల‌య్యాయో కానీ.. శ‌ష‌బిష‌లు లేకుండా కుండ బ‌ద్ధ‌లు కొట్టేసిన‌ట్లుగా అధికార‌పక్ష నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి. మొన్న‌టికి మొన్న రాష్ట్ర అప్పుల గురించి విప‌క్షం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన మంత్రి ఈటెల‌.. బాజ‌ప్తా.. అప్పులు చేస్తామ‌ని తేల్చేశారు.

అర‌వైఏళ్ల పాల‌న‌కు తెలంగాణ రాష్ట్రానికి రూ.60వేల కోట్ల మేర అప్పు లెక్క తేలితే.. మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో పాత అప్పుకు మ‌రో రూ.60వేల కోట్ల వ‌ర‌కూ చేర‌టంపై విప‌క్ష నేత‌లు గ‌ట్టిగా నిల‌దీస్తే.. అప్పులే చేస్తాం భ‌య్‌.. అప్పుల‌తోనే అభివృద్ధి.. మీరు అవున‌న్నా.. కాద‌న్నా అప్పులు చేసేది చేసేదే. దాన్ని ఎవ‌రూ ఆప‌లేరంటూ తేల్చి చెప్పారు.

ఈటెల నోటి నుంచి అంత మాట వ‌చ్చిన రెండు రోజుల‌కే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి ఆణిముత్యం లాంటి మాట ఒక‌టి వ‌చ్చింది.

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా మార్చ‌టం రాత్రికి రాత్రే సాధ్యం కాద‌ని.. అలా చేస్తాన‌ని తానెప్పుడూ చెప్ప‌లేద‌ని తేల్చేశారు. అక్క‌డితో ఆగ‌ని కేసీఆర్ మ‌రిన్ని మాట‌లు చెప్పారు. తెల్లారే లోపు బిల్డింగ్ లు క‌ట్ట‌లేమ‌ని.. దేనికైనా కొంత టైం ప‌డుతుంద‌ని.. బంగారు తెలంగాణ సాధ‌న దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

పాత ప‌ద్ధ‌తిలో విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాల‌ని.. 40.. 50 ఏళ్ల నాటి ధ్వంస‌మైన వ్య‌వ‌స్థ‌ను మూడేళ్ల‌లో నిర్మించ‌టం సాధ్య‌మ‌వుతుందా? అంటూ నిల‌దీశారు.

ఆశ్ర‌మ పాఠ‌శాల‌లు.. కాలేజీల ఏర్పాటుపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా కేసీఆర్ నోటి నుంచి ఈ అద్భుత‌మైన మాట‌లు వ‌చ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఉప నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అంటే త‌మ‌కు అర్థం కావ‌టం లేద‌ని.. ఏమిటీ బంగారు తెలంగాణ అంటూ ప్ర‌జ‌లు అడుగుతుంటే జ‌వాబు చెప్ప‌లేక‌పోతున్నామ‌న్నారు. రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌కుసొంత బిల్డింగ్ లు లేవ‌ని.. హాస్ట‌ళ్ల‌లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. ఓయూలో విద్యార్థులు చెట్ల కింద స్నాన్నాలు చేస్తున్నార‌ని.. విద్యార్థుల దుస్థితి ఇలా ఉంటే మ‌రోవైపు బంగారు తెలంగాణ దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తుందంటూ దులిపేశారు.

ఓ రేంజ్లో తెలంగాణ స‌ర్కారును కోమ‌టిరెడ్డి క‌డిగేస్తున్న వేళ క‌ల్పించుకున్న కేసీఆర్‌.. బ‌లంగా రిటార్ట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. వారంలో.. నెల‌లో బంగారు తెలంగాణ సాధ్యం కాద‌న్న కేసీఆర్‌.. తెల్లారే లోపే బంగారు తెలంగాణ తెస్తామ‌ని తాము చెప్ప‌లేద‌ని.. కాంగ్రెస్ నేత‌లే భ్ర‌మ‌ల్లో ఉన్నారంటూ విమ‌ర్శించారు. దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌కు చివ‌ర్లో మాత్రం హాస్ట‌ళ్లు.. పాఠ‌శాల‌ల‌కు సంబందించిన అంశంలో కొంత వాస్త‌వం ఉందంటూ ఒప్పుకున్నారు. అయితే.. ఇవ‌న్నీ స‌ర్దుకోవ‌టానికి కొంత‌కాలం ప‌డుతుంద‌న్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లుగా.. ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య‌లు మూడేళ్ల‌లో ఒక కొలిక్కి రావు. ఆ మాట‌లో ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ.. మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలోనే ఇప్ప‌టికే ఉన్న సీఎం క్యాంప్ ఆఫీసు స్థానే వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో భారీగా సీఎం గారు ఉండ‌టానికి భారీ భ‌వ‌నం ఎలా ఏర్ప‌డింద‌న్న‌ది ప్ర‌శ్న‌.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీల‌కం విద్యార్థులే. అందులోకి ఓయూ విద్యార్థుల త్యాగాల్ని ఎంత చెప్పినా త‌క్కువే. మ‌రి.. ఆ విద్యార్థుల బ‌తుకులు ఎందుకు మార‌లేదు? తెలంగాణ‌లో ఉన్న విద్యార్థుల హాస్ట‌ళ్ల రూపురేఖ‌లు మార‌కున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క‌భూమిక పోషించిన ఓయూ విద్యార్థులు చెట్ల కింద స్నాన్నాలు ఇంకా ఎందుకు చేస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌న‌క్క‌ర్లేదు కానీ మ‌న‌సును ప్ర‌శ్నించుకుంటే బంగారు తెలంగాణ మీద ముఖ్య‌మంత్రి వారి మాట‌లు మ‌రోలా ఉండేవేమో?