Begin typing your search above and press return to search.

టీ అసెంబ్లీ ప్ర‌త్యేక సెష‌న్‌ కు కేసీఆర్ రెడీ

By:  Tupaki Desk   |   26 Dec 2017 4:56 AM GMT
టీ అసెంబ్లీ ప్ర‌త్యేక సెష‌న్‌ కు కేసీఆర్ రెడీ
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మ‌రో కీల‌క ఎపిసోడ్‌ కు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. గత నెలలో 16 రోజులు శీతాకాల సమావేశాలను నిర్వహించిన గులాబీ ద‌ళ‌ప‌తి.. ప్రత్యేక అసెంబ్లీ సెష‌న్‌ కు సిద్ధ‌మైన‌ట్లు విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. మూడు రోజుల పాటు అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ నిర్వహించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. కీల‌క‌మైన బీసీ సబ్ ప్లాన్ - ఎస్సీ - ఎస్టీ అభివృద్ధి నిధి - కొత్త పంచాయితీరాజ్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారని స‌మాచారం.

బీసీల సంక్షేమం దృష్టి సారించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ క్ర‌మంలో బీసీల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులతో చర్చించిన సంగతి తెలిసిందే. అనంత‌రం బీసీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాల‌ని కోరారు. దీంతో వ‌రుస స‌మావేశాలు జ‌రిపిన బీసీ నేత‌లు బీసీలకు సబ్ ప్లాన్ తో పాటు..చట్ట సభల్లో రిజర్వేషన్ లాంటి కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ అంశాలపై సభలో చర్చించి సర్కార్ తరుపున స్టేట్ మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సభ్యుల డిమాండ్ ప్రకారం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుకు సర్కారు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటుగా ఎస్సీ - ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పెన్ డ్రైవ్ లో లక్ష పేజీల సమాచారాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఎమ్మెల్యేలకు - ఎమ్మెల్సీలకు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో స్టడీ చేసి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు రావాలని సీఎం సూచించారు. దళిత - గిరిజనుల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు లంబాడా - గిరిజనుల రిజర్వేషన్ల గొడవపై కూడా సీఎం సభలో స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు. ఇంతేకాకుండా పంచాయితీ రాజ్ చట్ట సవరణపై కొన్ని రోజులుగా ప్రభుత్వం వర్క్ చేస్తోంది. షెడ్యూలు ప్రకారం జరిగితే వచ్చే ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పంచాయతీరాజ్ బిల్లుకు చట్ట రూపం తేవాలనుకుంటోంది.

గ్రామస్థాయిలో జరిగే అవినీతికి సర్పంచ్ నే బాధ్యత చేస్తూ చట్టసవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయితీల కు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం తోపాటు.. పంచాయితీలను మినీ సెక్రటేరియేట్లుగా మార్చేలా చట్ట సవరణ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థూలంగా కీల‌క‌మైన మూడు అంశాల‌పై చ‌ర్చకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలోనే అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ జరిగే అవకాశం ఉందని స‌మాచారం.