Begin typing your search above and press return to search.

బీజేపీ భయంతో ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ మంత్రి పదవి?

By:  Tupaki Desk   |   8 July 2019 4:37 PM GMT
బీజేపీ భయంతో ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ మంత్రి పదవి?
X
తెలంగాణలో రాజకీయం వేగంగా మారుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి తిరుగులేని మెజారిటీతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ అక్కడికి ఆర్నెళ్లలో బలహీనపడ్డారు. ఎమ్మెల్యేల సంఖ్యపరంగా ఆయన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేనప్పటికీ బీజేపీకి తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉండడంతో టీఆరెస్ అధినేతకు నిద్రపట్టడం లేదు. ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను - నాయకులకు కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోవడం ఇంతవరకు తెలుసు. కానీ... మొన్నటి లోక్ సభ ఎన్నికల తరువాత సీను మారింది.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం..తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో పాటు కిషన్ రెడ్డికి కీలకమైన హోంశాఖ సహాయమంత్రి పదవికి కూడా వచ్చింది. తొలి రోజు నుంచే కిషన్ రెడ్డి దూకుడు చూపుతున్నారు... మరోవైపు అమిత్ షా కూడా తెలంగాణపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీలోకి నాయకుల వలసలు మొదలయ్యాయి. ఇలాంటి వేళ తెలంగాణవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడం ఇప్పుడు టీఆరెస్‌ కు సవాల్‌ గా మారింది. ఆ క్రమంలో బీజేపీ ఎంపీలున్న జిల్లాల్లో కొందరు బలమైన నేతలకు మంత్రి పదవులు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక చాలాకాలం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దాంతో నాయకులు అసంతృప్తి చెందినా కేసీఆర్ హవా నడవడంతో ఎవరూ బయటపడలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా ఉండకపోవచ్చు. అందుకే.. కేసీఆర్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారట. అందులోభాగంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కు మంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కమలాకర్ కరీంనగర్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. ఇంతవరకు కరీంనగర్లో వరుసగా మూడుసార్లు గెలిచినవారెవరూ లేకపోవడంతో తనకు మంత్రి పదవి వస్తుందని కమలాకర్ గతంలోనే అనుకున్నారు. కానీ... కేసీఆర్ మాత్రం ఆయనకు బదులు సీనియర్ అయిన ఈటెలకు పదవి ఇచ్చారు. కానీ.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత బండి సంజయ్ గెలిచారు. కమలాకర్ ఎంత దూకుడు గల నేతో.. సంజయ్ కూడా అంతే దూకుడు గల నేత. అన్ని వర్గాల్లో మంచి పట్టుంది కూడా. దీంతో అక్కడ ఏమాత్రం ఉపేక్షించినా టీఆరెస్ క్యాడర్‌ ను సంజయ్ బీజేపీలోకి లాక్కునే ప్రమాదం ఉందన్న భయంతో కమలాకర్‌ కు మంత్రి పదవి ఇచ్చి సంజయ్ కంటే ఓ మెట్టు పైన ఉంచి పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట.

బండి సంజయ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలాకర్ చేతిలో ఓడిపోయారు. కానీ, అక్కడి నాలుగు నెలల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. పైగా ఇప్పుడు మరో తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో ఆయనకు సన్నిహితుడైన సంజయ్ కూడా మెల్లగా పట్టు బిగిస్తున్నారు. దీంతో.. సంజయ్ ప్రాబల్యం నుంచి పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కమలాకర్‌ కు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట.