Begin typing your search above and press return to search.

జగన్ తో ‘నీటి యుద్ధానికి’ రెడీ అయిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   20 Jun 2021 5:55 AM GMT
జగన్ తో ‘నీటి యుద్ధానికి’ రెడీ అయిన కేసీఆర్!
X
ఏపీ సీఎం జగన్ తో ‘నీటి యుద్ధానికి’ తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. కృష్ణ బేసిన్ లో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అనుమతిలేని ప్రాజెక్టులపై తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ తోపాటు కేంద్రప్రభుత్వం కూడా ఆదేశించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయడం లేదని కేసీఆర్ ఆరోపించారు.

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని ఎత్తి చూపాలని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడింది.

తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం కృష్ణ బేసిన్ లోనూ ప్రాజెక్టులను నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ‘జోగులాంబ బ్యారేజీ’ పేరిట గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద కృష్ణ నదిపై ఓ బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించింది. ఇక్కడి నుంచి 60-70 టీఎంసీల వరదనీటిని పైపులైన్ ద్వారా తరలించాలని భావిస్తోంది. ఏదుల రిజర్వాయర్ కు నీటిని ఎత్తిపోసి పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల అవసరాలను తీర్చాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవే కాదు.. పులిచింతలలో ఎడమ కాల్వ నిర్మాణం, సుంకేశుల, నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ల వద్ద మరో రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించనున్నారు. దీనిపై డీపీఆర్ తయారు చేయాలని జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ అనుమతి లేని ప్రాజెక్టులపై ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రికి వినతిపత్రాలు సమర్పించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్డీఎస్) కుడికాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. రాష్ట్రానికి కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కలేదని.. బ్రిజేష్ ట్రిబ్యూనల్ ఏర్పాటైనా అన్యాయమే జరుగుతోందన్నారు. కేంద్రం కూడా తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని కేబినెట్ ఆక్షేపించింది.

-తండ్రి రాజశేఖర్ రెడ్డిని మించిపోయిన జగన్
ఏపీ సీఎం జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని మించిపోయాడని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా బేసిన్ లో ఏపీ సర్కార్ అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటిలో ఏపీ సీఎం జగన్ పై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కు చట్టాలపై గౌరవం లేదని.. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారన్నారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోవద్దని.. అవసరమైతే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో ధర్నా చేద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్ లో ఏపీ సర్కార్ కుట్రలను కట్టడి చేయడానికి మన దగ్గర కూడా ఏడెనిమిది ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుందామని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుదామని కేసీఆర్ స్పష్టం చేశారు.