Begin typing your search above and press return to search.

భారీ ప‌రీక్ష‌కు కేసీఆర్ రెఢీ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:12 AM GMT
భారీ ప‌రీక్ష‌కు కేసీఆర్ రెఢీ అవుతున్నారా?
X
ఎవ‌డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ సినిమా డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తెలుగు రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్నా.. ఊహించ‌ని రీతిలో పావులు క‌ద‌పాల‌న్నా.. త‌న రాజ‌కీయ‌ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం మింగుడుప‌డ‌ని రీతిలో షాకులు ఇవ్వాల‌న్నా తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. తాజాగా ఆయ‌న తీసుకుంటున్నారంటూ ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఒక వ్యూహం తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌కు తెర తీసేలా ఉంద‌నటంలో సందేహం లేదు.

సాధార‌ణంగా ఏ అధికార‌ప‌క్ష‌మైనా ప్ర‌జ‌ల్లో త‌న బ‌లం ఎంత ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌టం కోసం అయితే స‌ర్వేలు నిర్వ‌హించుకోవ‌టం మామూలే. అంద‌రి ముఖ్య‌మంత్రుల్లా వ్య‌వ‌హ‌రించ‌ని కేసీఆర్‌.. తాజాగా అందుకు భిన్నంగా స‌రికొత్త రీతిలో నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల కాలంలో త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌పై ప్ర‌జ‌ల స్పంద‌న ఎలా ఉంది? ఎన్నిక‌లకు ఏడాదిన్న‌ర‌ ముందు ఉప ఎన్నిక‌కు వెళితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ‌కున్న ప్ర‌జాబ‌లాన్ని ఉప ఎన్నిక‌ల రూపంలో ప్ర‌ద‌ర్శించుకోవ‌టం ద్వారా.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తిప‌క్షాల దూకుడుకు బ్రేకులు వేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో.. విప‌క్షాల‌ను దెబ్బ తీసేందుకు వీలుగా ఉప ఎన్నిక‌ను తెర మీద‌కు తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు. సాధార‌ణంగా ఉప ఎన్నిక‌కు సంబంధించి అధికార‌ప‌క్షానికి ఎడ్జ్ ఉంటుంది. ఎలాంటి భావోద్వేగం లేని వేళలో అయితే.. అధికార‌ప‌క్షానికి ఉప ఎన్నిక న‌ల్లేరు మీద న‌డ‌క‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా తెలంగాణ‌లో ఒక ఉప ఎన్నిక వ‌చ్చేలా చేసి.. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ శ్రేణుల్ని రంగంలోకి దించి.. త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం ద్వారా ఎన్నిక‌ల ముందు విపక్షాల‌ను నిరాశ‌.. నిస్పృహ‌ల్లో నెట్టేలా చేయాల‌న్న‌ది కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. ఇందులో భాగంగా న‌ల్గొంగ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయిస్తార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ బొమ్మ మీద గెలిచిన గుత్తా.. కొంత‌కాలం క్రిత‌మే పార్టీ నుంచి జంప్ అయి గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే.. మిగిలిన జంప్ జిలానీలకు భిన్నంగా ఆయ‌న అధికార‌ప‌క్షానికి కాస్త దూరం మొయింటైన్ చేస్తున్నారు. గులాబీ కారులో ఎక్కిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికి గులాబీ కండువ ఆయ‌న మెడ‌లో వేసుకోక‌పోవ‌టం చూస్తేనే గుత్తా తీరు ఎంత వ్యూహాత్మ‌కంగా ఉందో ఇట్టే తెలుస్తుంది.

గుత్తా చేత రాజీనామా చేయించ‌టం ద్వారా.. ప‌లు ప్ర‌యోజ‌నాలు ఆశిస్తున్న కేసీఆర్‌. న‌ల్గొండ జిల్లాకు చెందిన గుత్తా చేత రాజీనామా చేయించాల‌న్న నిర్ణ‌యం వెనుక ఒక ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీల‌క నేత‌లు ఆ జిల్లాలోనే ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండు.. మూడు జిల్లాల్లో బ‌ల‌మైన‌ కాంగ్రెస్ నేత‌లు ఉన్నారు. అలాంటి జిల్లాల్లో న‌ల్గొండ ఒక‌టి.

తాజాగా ఉప ఎన్నిక జ‌రిగేలా గుత్తా చేత రాజీనామా చేయించి క్యాబినేట్ హోదా ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌టం ద్వారా ఆయ‌న‌కు అసంతృప్తిని పోగొట్టొచ్చు. బ‌ల‌మైన ఆర్థిక మూలాలు ఉన్న నాయ‌కుడ్ని బ‌రిలోకి దించ‌టం ద్వారా విప‌క్షాల‌కు పెను స‌వాలు విస‌ర‌టం ఒక ఎత్తు అయితే.. ఎన్నిక‌ల్లో పార్టీ శ్రేణుల్ని.. ముఖ్యంగా మంత్రుల్ని భారీగా మొహ‌రించ‌టం ద్వారా ఉప ఎన్నిక ఫ‌లితాన్ని పాజిటివ్ గా మార్చుకోవాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

ఎంపీ ప‌ద‌వి త్యాగం చేసిన గుత్తాకు రాష్ట్ర రైతు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించాల‌ని కోరుతున్నారు. ఈ ఎన్నిక‌లో విజ‌యంసాధిస్తే.. కాంగ్రెస్‌ కు కీల‌క‌మైన న‌ల్గొండ జిల్లా నేత‌ల నోటికి తాళం ప‌డిన‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణాల్లో కూడా తాజా ఉప ఎన్నిక కీల‌క‌మే అవుతుంద‌ని చెబుతున్నారు. త‌న బ‌లాన్ని నిరూపించుకునేందుకు ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఉప ఎన్నిక అంచ‌నాలు నిజ‌మై.. కేసీఆర్ కానీ ఉప ఎన్నిక‌కు నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం పెను సంచ‌ల‌నం అవుతుంద‌న‌టంలో మ‌రెలాంటి సందేహం అక్క‌ర్లేదు.