Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్యాబినెట్ ప్రక్షాళన కసరత్తు పూర్తయ్యిందా?

By:  Tupaki Desk   |   10 March 2016 4:08 AM GMT
కేసీఆర్ క్యాబినెట్ ప్రక్షాళన కసరత్తు పూర్తయ్యిందా?
X
ఆపరేషన్ ఆకర్ష్ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చిన వారికి ఇచ్చిన హామీల్ని పూర్తి చేయటంతో పాటు.. భవిష్యత్ కార్యాచరణకు తగినట్లుగా పార్టీని సిద్ధం చేసే పనిలో భాగంగా తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేయటంతో పాటు.. పలు పదవుల విషయంలో కీలక మార్పులు చేపట్టే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

తాజా మార్పులకు మరో కారణం ఉందని చెబుతున్నారు. 2019లో జరిగే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు మరో ఏడాదిలో మొదలు పెట్టాల్సిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లుగా కొన్ని పదవుల్ని మార్చటం అనివార్యమన్న భావనలో కేసీఆర్ ఉన్నారని.. ఇప్పుడు పదవుల్లో కొద్దిపాటి అసమతౌల్యత ఉన్న పరిస్థితుల్లో.. మార్పు తప్పనిసరిగా చెబుతున్నారు.

తాజా కసరత్తులో భాగంగా పార్టీకి చెందిన కీలక నేతలు కొదరిని మంత్రివర్గం నుంచి తప్పించి.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. ఇందుకు తగినట్లుగా ఆయనో వ్యూహం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక.. ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీలోకి వచ్చిన నేతలకు కొన్ని పదవులు ఇవ్వాల్సిన రావటం మార్పులుచేర్పులకు కారణంగా చెప్పొచ్చు. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేదని.. డిప్యూటీ సీఎంగా రాజయ్యను తప్పించిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి క్యాబినెట్ లో స్థానం లభించలేదన్న విమర్శలకు చెక్ చెప్పేలా తాజా మార్పులు ఉంటాయని చెబుతున్నారు.

మార్పులు.. చేర్పులు ఏమంటే..?

విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ త్వరలో చేసే మార్పులు ఈ తీరులో ఉండొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం శాసన మండలి ఛైర్మన్ గా ఉన్న స్వామిగౌడ్ను మంత్రి వర్గంలోకి తీసుకొని.. ఆయన స్థానాన్ని కడియం శ్రీహరికి అప్పగించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ను ఆ పదవి నుంచి తప్పించి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కొప్పుల ఈశ్వర్ పదవిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు అప్పగించే అవకాశం ఉంది.

ఇక.. ప్రస్తుతం కీలక శాఖలకు మంత్రులగా వ్యవహరిస్తున్న నాయిని నర్సింహారెడ్డి.. పద్మారావు.. జోగు రామన్నను మంత్రి వర్గం నుంచి తప్పించి పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పజెబుతారని.. వారి స్థానంలో నిరంజన్ రెడ్డి.. కొండా సురేఖలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక.. పలువురు మంత్రుల శాఖలు కూడా మార్చే వీలుందని తెలుస్తోంది. ఇవి కాక.. మరికొన్ని మార్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు.