Begin typing your search above and press return to search.

తెలంగాణ దశను మార్చేలా కేసీఆర్ ప్లాన్

By:  Tupaki Desk   |   13 April 2019 4:33 AM GMT
తెలంగాణ దశను మార్చేలా కేసీఆర్ ప్లాన్
X
తెలంగాణ దశను మార్చే కొత్త చట్టానికి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించడానికి గొప్ప సంస్కరణకు పూనుకున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు - సంస్థలను మరింత పారదర్శకంగా రూపొందించడానికి భారీ ముందడుగు వేశారు. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తన అమ్ముల పొదిలోని భారీ అస్త్రాన్ని బయటకు తీశారు.

పుట్టాలన్నా లంచం.. చచ్చాక డెత్ సర్టిఫికెట్ కు లంచం.. సర్టిఫికెట్లు కావాలన్నా లంచం.. మ్యూటేషన్లు - రిజిస్ట్రేషన్లు - ప్రభుత్వ పనులు ఏవైనా చేయితడపనిదే ఒక్క పని కాని పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు.. నిందలు.. అందుకే కేసీఆర్ వీటన్నింటినికి పరిష్కారంగా కొత్త పురపాలక - రెవెన్యూ చట్టాలకు పదును పెడుతున్నారు. తాజాగా ప్రగతి భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులతో పురపాలన చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్షించారు.

ఇప్పటికే పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని తెచ్చిన కేసీఆర్.. ఇప్పుడు పురపాలక సంస్థలను బలోపేతం చేసి వాటికి అధికారాలు - బాధ్యతలు అప్పగించేలా కొత్త చట్టం చేస్తామని ప్రకటించారు.

నూతన పురపాలక చట్టంలో విప్లవాత్మక మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు.. ఒక్క నయాపైసా లంచం ఇవ్వకుండా పనులు పూర్తి అయ్యేలా ఆన్ లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. అలాగే నిర్ణీత గడువులోగా అధికారి పని చేయకపోతే జరిమానా పడేలా చట్టంలో రూపకల్పన చేయనున్నారు. రెవెన్యూ చట్టాన్ని కూడా ఇదేతరహాలో మార్చేందుకు కేసీఆర్ నడుం బిగించారు..

రాష్ట్రంలో త్వరలో పురపాలన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని ముందుకు తీసుకురావాలా.? ఎన్నికల తర్వాత తీసుకురావాలా అనే అంశంపై ప్రధానం సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణలో ఈ చట్టం అమలైతే మాత్రం ఇక పురపాలికల్లో అవినీతికి పూర్తి స్థాయిలో చెక్ పడనుంది.