Begin typing your search above and press return to search.

కేసీఆర్ వైఖరే.. నంబర్2కు కారణమా.?

By:  Tupaki Desk   |   11 July 2018 5:38 AM GMT
కేసీఆర్ వైఖరే.. నంబర్2కు కారణమా.?
X
దేశంలో సులభ వాణిజ్య పద్ధతులను అమలు చేస్తూ.. వ్యాపారవేత్తలను ఆకర్షిస్తున్న జాబితాను తాజాగా కేంద్రవాణిజ్యశాఖ - ప్రపంచ బ్యాంకు కలిసి సంయుక్తంగా విడుదల చేశాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య తేడా కేవలం 0.09 మార్కులే కావడం గమనార్హం. హర్యాణా - జార్ఖండ్ - గుజరాత్ లు 3 - 4 - 5 వ స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ వెంట్రుక వాసిలో మొదటి స్థానాన్ని కోల్పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోయిన ఏడాది ఏపీ - తెలంగాణ రెండు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో నిలవగా.. ఈసారి మాత్రం తెలంగాణ కాస్త వెనుకబడడానికి కారణాలు ఏంటనేది ఆసక్తిగా మారింది.

* తెలంగాణ వెనుకబడింది ఇక్కడే..

తెలంగాణ రెండో స్థానానికి దిగజారడాన్ని మంత్రి కేటీఆర్ ఏం తప్పుపట్టలేదు. పైగా మొదటి స్థానంలో నిలిచిన ఏపీకి శుభాకాంక్షలు చెప్పారు.కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా తమను కాదని ఏపీ మొదటిస్థానంలో నిలవడమే టీఆర్ ఎస్ ముఖ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇందుకు ప్రధానంగా కేసీఆర్ వైఖరే కారణమని విమర్శలు వస్తున్నాయి. విధాన సంస్కరణల్లో 100శాతం మార్కులు పొందిన తెలంగాణ - ఈ విభాగంలో మొదటిస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ (99.73శాతం) కంటే కూడా ఎక్కువే సాధించింది. అయితే పారిశ్రామిక వేత్తల నుంచి గుడ్ విల్ పొందడంలో మాత్రం తెలంగాణ విఫలమైంది. ఈ విభాగంలో ఏపీ అందరికంటే అధికంగా 86.50 శాతం మార్కులు తెచ్చుకోగా.. తెలంగాణ 83.95శాతం మార్కులు మాత్రమే పొందింది. ఇక్కడే తెలంగాణ దెబ్బతింది.

*కేసీఆర్ వైఖరే కారణం..?

తెలంగాణ వెనుకబడడానికి ప్రధాన కారణం.. పారిశ్రామికవేత్తల భరోసాను వంద శాతం సంపాదించకపోవడమే.. తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే పారిశ్రామిక వేత్తలను కేసీఆర్ సరిగ్గా రిసీవ్ చేసుకోరనే అపవాదు ప్రచారంలో ఉంది. ఆ మధ్య దేశంలోనే దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా హైదరాబాద్ టీహబ్ కు వస్తే ఓ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ లో ఉండి కూడా కేసీఆర్ వెళ్లకుండా ఆయన కుమారుడు కేటీఆర్ ను పంపారు. ఇది పరిశ్రమ వర్గాల్లో వ్యతిరేక ప్రచారాన్ని వ్యాపింపచేసింది. పారిశ్రామిక వేత్తలు - పెట్టుబడిదారులను కేసీఆర్ సరిగ్గా రిసీవ్ చేసుకోరనే అపవాదును పెంచింది. అప్పట్లో వచ్చిన చైనా పెట్టుబడిదారులను కూడా తెలంగాణ పట్టించుకోకుండా వదిలేసింది. వారు తిరిగి వెళ్లిపోతూ అసహనం వ్యక్తం చేశారు. ఇలా పెట్టుబడిదారుల మనసులను చూరగొనడంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దల అలసత్వమే ఇప్పుడు వారికి నంబర్ 1 ర్యాంకును దూరం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.