Begin typing your search above and press return to search.

అప్పు ఇస్తాన‌న్న వారికి షాక్ ఇచ్చిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   17 Nov 2015 7:27 AM GMT
అప్పు ఇస్తాన‌న్న వారికి షాక్ ఇచ్చిన కేసీఆర్‌
X
అవ‌స‌రాల్లో ఉన్న‌పుడు అప్పు ఇచ్చేందుకు ఎవ‌రైనా ముందుకు వ‌స్తే సాధారణంగా ఏం చేస్తారు? ఎగిరి గంతేసి స‌ద‌రు ఆఫ‌ర్ ఇచ్చిన వారికి ఎర్ర‌తివాచి ప‌రుస్తారు. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ఆర్థిక క‌ట‌క‌ట ఉన్న‌ప్ప‌టికీ...అప్పులు ఇచ్చే వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా...కేసీఆర్ నో చెప్పారు.

నూతన రాష్ట్రమైన తెలంగాణకు ఉన్న ఆర్థిక అవసరాలను గమనించిన కొన్ని విదేశీ బ్యాంకులు - సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. తాము ఇవ్వ‌బోయే రుణాల గురించి చర్చించేందుకు కొద్ది రోజుల క్రితం కొన్ని విదేశీ సంస్థలు - బ్యాంకుల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఇద్దరు - ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌ లతో భేటీ అయ్యారు. తమ సంస్థలు దేశంలోని ఇతర ప్రాంతాలు - రాష్ట్రాలతోపాటు విదేశాల్లో సైతం రుణాలు ఇస్తున్న విషయాలను వారు ప్రస్తావించారు. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప‌త్రాలను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సైతం రుణాలివ్వటానికి తాము ముందుకొస్తున్నామని చెప్పారు.

మామూలుగానైతే రుణం తీసుకున్నందుకు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది...కానీ తమ సంస్థలకు వడ్డీకి బదులు ప్రభుత్వ భూముల్ని త‌న‌ఖాగా ఉంచాలని స‌ద‌రు బ్యాంకుల ప్ర‌తినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ భూములను హామీగా ఉంచాలని బ్యాంకుల ప్ర‌తినిధులు కోరటంతో రుణాల అంశానికి ఫుల్ స్టాప్ పడినట్టు తెలిసింది. అయితే విరివిగా భూముల ఇస్తున్న ప్ర‌భుత్వం రుణం కోసం త‌న‌ఖా పెట్టేందుకు ఎందుకు వెన‌క‌డుగు వేసింద‌ని ఆరాతీయగా....ఎన్నో ఆశలు - ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రుణాల కోసం ప్రభుత్వ భూముల్ని త‌న‌ఖాగా ఉంచటం వల్ల...రాజకీయంగా చిక్కులెదురవుతాయని అధికారవర్గాలు భావించాయి. ఇది టీఆర్‌ ఎస్‌ సర్కారుకు తీవ్ర ఇబ్బందిగా మారుతుంద‌ని భావించిన సీఎం కేసీఆర్‌ 'తర్వాత చూద్దాం...' అని చెప్పి ప్రతినిధుల్ని తిప్పిపంపారట‌.