Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీయుల్ని బ‌య‌ట‌కు రావొద్ద‌న్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   3 Oct 2017 5:02 AM GMT
హైద‌రాబాదీయుల్ని బ‌య‌ట‌కు రావొద్ద‌న్న కేసీఆర్‌
X
హైద‌రాబాదీయుల‌కు పెను హెచ్చ‌రిక‌ను చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. సోమ‌వారం కురిసిన భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పించి బ‌య‌ట‌కు రావొద్ద‌ని హైద‌రాబాదీయుల‌కు స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్‌. కేవ‌లం రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో సుమారు 10 సెంటీమీట‌ర్ల‌కు పైనే కురిసిన వాన‌తో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. అధికారిక వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్య‌లో 13 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో సింహ‌భాగం మొద‌టి రెండు గంట‌ల్లోనే ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

వ‌ర్షం విసిరిన స‌వాలుకు మ‌హాన‌గ‌రం విల‌విల‌లాడిపోయింది. ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం అంటే ఎలా ఉంటుందో తాజా వ‌ర్షం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ కురిసిన వ‌ర్షాల‌కు.. తాజా వ‌ర్షానికి మ‌ధ్య వ్య‌త్యాసం ఏమిటంటే.. భారీ వ‌ర్షంతో లోత‌ట్టు ప్రాంతాల‌కు వ‌ర‌ద మాదిరి నీటి ఉధృతి క‌నిపించింది.

న‌గ‌రానికి న‌డిబొడ్డు లాంటి అమీర్ పేటలో మోకాళ్ల లోతు నీళ్లు ర‌హ‌దారిపైన నిలిచిపోయాయి. చాలా కార్ల లోప‌ల‌కు నీళ్లు వ‌చ్చాయి. అమీర్ పేట‌లోనే కాదు సంప‌న్నులు ఉండే జూబ్లీహిల్స్‌.. మాదాపూర్‌.. కొండాపూర్ ల‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. దీంతో.. ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లోకి న‌గ‌రజీవి వెళ్లిపోయాడు. వ‌ర్ష తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

అధికార యంత్రాంగం అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌.. జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్ధ‌న్ రెడ్డి.. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డితో మాట్లాడారు. లోత‌ట్టు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. రాత్రంతా ఎక్క‌డ ఇబ్బంది ఉన్నా అధికార యంత్రాంగం వెంట‌నే స్పందించాల‌న్నారు. ప్ర‌జ‌లు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ఎప్పుడూ లేని రీతిలో కీల‌క వ్యాఖ్య చేసిన సీఎం కేసీఆర్‌.. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పించి ఇళ్లల్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌న్నారు. ఇలాంటి హెచ్చ‌రిక‌నే ఈ మ‌ధ్య‌న అమెరికాను చుట్టుముట్టిన హ‌రికేన్ల సంద‌ర్భంగా అక్క‌డి గ‌వ‌ర్న‌ర్లు ప్ర‌జ‌ల‌ను ఆదేశించారు.

అయితే.. అమెరికాలో గంట‌కు 160 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీయ‌టంతో ప్ర‌జ‌ల‌కు బ‌య‌ట‌కు రావొద్ద‌న్న వార్నింగ్ ఇస్తే.. హైద‌రాబాద్ లో మాత్రం భారీ వ‌ర్షంతో రోడ్ల మీద వ‌ర్ష‌పు నీరు నిల‌బ‌డిపోవ‌టంతో ప్ర‌జ‌ల‌కు బ‌య‌ట‌కు రావొద్ద‌న్న మాట చెప్పిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. హైద‌రాబాద్ మహాన‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చి దిద్దుతామ‌ని గొప్ప‌లు చెప్పుకునే కేసీఆర్ అండ్ కో.. చివ‌ర‌కు వర్షం దెబ్బ‌కు ఇళ్లల్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని చెప్ప‌టం చూస్తే.. కేసీఆర్ చేత‌కానిత‌నం చూసి అయ్యో అనుకోవాలా? మూడున్న‌రేళ్ల పాల‌న‌లో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని ఎంత దారుణంగా త‌యారు చేశారో అన్న భావ‌న‌తో మండి ప‌డాలా? అన్న‌ది ప్ర‌జ‌లే తేల్చుకోవాలి.