Begin typing your search above and press return to search.

వాత పెట్టి ఎంతలా వెన్న రాస్తారంటే..

By:  Tupaki Desk   |   27 April 2016 4:44 PM GMT
వాత పెట్టి ఎంతలా వెన్న రాస్తారంటే..
X
దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకులు ఇవ్వటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేం కాదు. తాజాగా తెలంగాణ వాణిజ్యశాఖను తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి కేసీఆర్ లాగేసుకోవటం తెలిసిందే. ముఖ్యమంత్రి ఇచ్చిన షాకుకి తలసాని చాలా బాగా ఫీలైనట్లుగా చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ తన చేతికి వచ్చాక రాష్ట్ర సర్కారుకు ఆదాయాన్ని పెంచిన విషయాన్ని సన్నిహితుల దగ్గర పదే పదే చెప్పుకుంటున్నారని చెబుతున్నారు.

మరోవైపు.. తలసాని నుంచి వాణిజ్యపన్నుల శాఖను తీసేయటంపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేయటమే కాదు.. కేసీఆర్ మంచిపని చేసినట్లుగా వ్యాఖ్యానించారు. దీంతో.. తలసాని వర్గం మరింతగా ఫీలైపోతున్నారట. ఇదిలా ఉండగా.. తలసానికి డిమోషన్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే ప్రస్తావన వచ్చిన సందర్భంగా ఆయన తనదైన శైలిలో స్పందించారు.

తలసాని స్థాయి తగ్గించలేదని.. పెంచినట్లుగా పేర్కొన్నారు. తలసానితో చర్చలు జరిపిన తర్వాతే ఆయన శాఖకు సంబంధించిన మార్పులు చేసినట్లుగా పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తీసుకురావటంలో తలసాని కీలకంగా వ్యవహరించినట్లుగా కేసీఆర్ చెప్పారు. మరింత బాగా పని చేస్తే.. వాణిజ్య శాఖను ఎందుకు తీసేసినట్లు..? కీలకమైన శాఖను కోత పెట్టి తలసానికి వాత పెట్టిన కేసీఆర్ తన మాటలతో వెన్నపూత పూయటం గమనార్హం.