Begin typing your search above and press return to search.

బాబు గాలి మాట‌ల లెక్క చెప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:14 AM GMT
బాబు గాలి మాట‌ల లెక్క చెప్పిన కేసీఆర్‌
X
ఉత్త పుణ్యానికే ఎవ‌రి మీదా ప‌డ‌టం కేసీఆర్ మాట‌ల్లో అస‌లు ఉండ‌దు. త‌న‌ను ప్ర‌త్య‌క్షంగా కానీ ప‌రోక్షంగా కానీ టార్గెట్ చేస్తే.. ఆ విష‌యాన్ని చ‌ప్పున గుర్తించి వాత పెట్టిన చందంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం ఆయ‌న‌కు అల‌వాటు. తాజాగా అలాంటి ప‌నే మ‌రోసారి చేసి చూపించారు కేసీఆర్‌. ఇటీవ‌ల కాలంలో అవ‌స‌రం లేకున్నా.. త‌న రాజ‌కీయ స్వార్థం కోసం.. త‌న ఐడెంటిటీని ప్ర‌ద‌ర్శించుకోవాల‌న్న క‌క్కుర్తితో ఏపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ కెలుకుడు వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

ఉద్య‌మ వేళ‌లో టీజీ వెంక‌టేశ్ లాంటోళ్ల మాట‌ల్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాలిపోయేలా చెప్పిన కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును టార్గెట్ ఏశారు. గాలి మాట‌లు చెబితే న‌ష్ట‌మేన‌న్న విష‌యాన్ని చెబుతూ.. త‌మ ప‌క్క‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అన్నీ గాలి మాట‌లే చెబుతోంద‌ని.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం చేత‌ల్లో ప‌ని చేసి చూపిస్తున్న వైనాన్ని చెప్పారు. అన‌వ‌స‌ర‌మైన మాట‌ల్ని చెబితే ఎవ‌రికైనా ఓట‌మి త‌ప్ప‌ద‌న్న ఆయ‌న‌.. రానున్న ఎన్నిక‌ల్లో 50 శాతం ఓట్ల‌ను టీఆర్ ఎస్ సొంతం చేసుకోనున్న‌ట్లు చెప్పారు.

వంద‌కు పైగా సీట్ల‌లో టీఆర్ ఎస్ పార్టీ గెల‌వ‌నున్న‌ట్లు చెబుతున్న ఆయ‌న‌.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు డిపాజింట్లు కూడా రావంటూ వ‌ణికించే మాట‌ల్ని చెప్పారు. బాబు స‌ర్కారుపై కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌లు ఏపీ అధికార‌ప‌క్షాన్ని బ‌లంగానే తాకాయ‌ని చెప్పాలి. కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన గాలి మాట‌ల్ని చూస్తే.. ఏపీకి ప్రాణ‌వాయువు లాంటి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబు స‌ర్కారు అనుస‌రించిన వైనం.. తొలుత ప్ర‌త్యేక హోదా అని చెప్పి.. త‌ర్వాత ప్ర‌త్యేక ప్యాకేజీకి ఓకే అన‌టంపై వెల్లువెత్తిన విమ‌ర్శ‌ల్ని కేసీఆర్ పరోక్షంగా ప్ర‌స్తావించార‌ని చెప్పాలి.

తన‌కు ఏ మాత్రం సంబంధం లేకున్నా.. తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెట్టిన టీజీ వెంక‌టేశ్‌.. త‌న వ్యాఖ్య‌ల‌తో సెంటిమెంట్ల‌ను రాజేయాల‌ని చూడ‌టంపై టీఆర్ ఎస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నేత‌లు ప‌లువురు వ్యాఖ్యానించినా.. ఏపీ స‌ర్కారు మాత్రం ప్ర‌త్యేక హోదా.. ప్యాకేజీ అంటూ మాట‌లు మార్చాయ‌ని గులాబీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు.

సోద‌ర రాష్ట్రం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించాల‌ని తాము ప్ర‌య‌త్నిస్తుంటే.. అందుకు భిన్నంగా ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు త‌మ‌ను టార్గెట్ చేయ‌టం ఏమిటి? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. టీజీ లాంటోళ్లు అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌ల‌తో త‌మ‌ను ఇరుకున పెట్టాల‌ని భావిస్తున్న వైనంపై టీఆర్ ఎస్ అధినేత ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే కేసీఆర్ నోట ఏపీ స‌ర్కారు గాలి మాట‌లు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. క‌దిలించుకొని మ‌రీ తిట్టించుకోవ‌టం టీజీ వెంక‌టేశ్ లాంటోళ్ల‌కు త‌ప్ప‌దు. అలాంటి వారిని ప్రోత్స‌హించే చంద్ర‌బాబు సైతం మాట ప‌డ‌క త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి గుర్తిస్తే మంచిది.