Begin typing your search above and press return to search.

బాబు చక్రానికి కేసీఆర్ అడ్డుపుల్ల!

By:  Tupaki Desk   |   13 May 2019 10:53 AM GMT
బాబు చక్రానికి కేసీఆర్ అడ్డుపుల్ల!
X
ఏపీలో ఈ సారి అధికారం చేజారినా కాంగ్రెస్ వాళ్లతో సఖ్యత నెరుపుతూ ఢిల్లీలో చక్రం తిప్పాలనే ప్రయత్నంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ అడ్డు పుల్లలు గట్టిగానే వేస్తూ ఉన్నారు. తన చేతికి ఎన్ని ఎంపీ సీట్లు దక్కుతాయో చంద్రబాబుకే తెలీదు ఇప్పటి వరకూ. ఏపీలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పలితాలు వచ్చే అవకాశం లేదని.. ఆ పార్టీ మూడు నుంచి ఐదు ఎంపీ సీట్లకు పరిమితం కావొచ్చనే అంచనాలున్నాయి.

అయినా చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తూ వస్తున్నారు. వివిధ పార్టీల వాళ్ల వద్దకు తనే వెళ్లి బాబు శాలువాలు కప్పి, సన్మానాలు చేస్తూ.. వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే కేసీఆర్ రంగంలోకి దిగి చంద్రబాబు నాయుడి ప్రయత్నాలకు చెక్ చెబుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడటంలో తనే కీలక పాత్ర పోషించాలని, అన్ని పార్టీలతోనూ తనే చర్చలు జరిపి ప్రాధాన్యతను పెంచుకోవాలని బాబు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు.

అయితే కేసీఆర్ బాబు ప్రాధాన్యతను తగ్గించి చేస్తున్నాడు. ఇప్పటికే సీపీఎం, జేడీఎస్ వాళ్లతో కేసీఆర్ టచ్లోకి వెళ్లాడు. అలాగే మమతా బెనర్జీకి కూడ కేసీఆర్ టచ్లో ఉన్నాడు. డీఎంకేతో కూడా అనుకున్న మీటింగును సాధిస్తున్నాడాయన.

ఇలా కలవడం వల్ల వాళ్లతో ఫలితాల అనంతరం చర్చలకు కేసీఆర్ కు సులభం అవుతుంది. సదరు పార్టీ నేతలను ఏ కూటమి వైపుకు తీసుకు వెళ్లాలన్నా కేసీఆర్ కు అందరితోనూ యాక్సెస్ ఉన్నట్టువుతుంది. చంద్రబాబుకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో తెలీదు. కేసీఆర్ మాత్రం 15 ఎంపీ సీట్ల విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

చేతిలో ఆ మాత్రం ఎంపీ సీట్లు ఉంటే, మంచి కమ్యూనికేటర్ అయిన కేసీఆర్ మిగతా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకోగల శక్తి అవుతారు. అప్పుడు కేసీఆర్ చక్రం తిరిగినా తిరగొచ్చు. అది తిరిగితే చంద్రబాబు చక్రానికి చెక్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.