Begin typing your search above and press return to search.

కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌ ఎంఐఎం?

By:  Tupaki Desk   |   3 Jan 2019 6:09 AM GMT
కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌ ఎంఐఎం?
X
ఏపీలో రాజ‌కీయాల్లో వేలు పెడ‌తాం - చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటూ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌ల తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఆయ‌న ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ ఏమ‌య్యుంటుంద‌న్న దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో, సాధార‌ణ ప్ర‌జానీకంలో విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. అనేక విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి.

రిట‌ర్న్ గిఫ్ట్ కు సంబంధించి తాజాగా ఆస‌క్తికర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఎంఐఎం రూపంలో చంద్ర‌బాబుకు కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎంఐఎం ద్వారా టీడీపీ ఓటు బ్యాంకును దెబ్బ‌తీసేందుకు ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు స‌మాచారం అందుతోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ముస్లింల సేవియ‌ర్ గా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించేందుకు ఎంఐఎం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఏపీ నుంచి ముస్లిం నేత‌ల‌ను పిలిపించి వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ముస్లింల ప‌రిస్థితిని వివ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంఐఎంకు మ‌ద్ద‌తివ్వాల‌ని వారిని కోరుతున్నారు.

ఏపీలో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్ల‌లో పోటీ చేయాల‌ని ఎంఐఎం భావిస్తోంది. త‌ద్వారా టీడీపీకి మైనారిటీ ఓట్ల‌ను దూరం చేయాల‌ని వ్యూహ ర‌చ‌న చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ - వైసీపీ మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 5 ల‌క్ష‌లు. కాబ‌ట్టి ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట‌ర్ల‌ను దూరం చేస్తే తెలుగుదేశం పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతుంది. విజ‌యావ‌కాశాలు దాదాపుగా దూర‌మ‌వుతాయి. ముఖ్యంగా క‌డ‌ప‌, అనంత‌పూర్‌, గుంటూరు, విజ‌య‌వాడ‌, వైజాగ్ వంటి ప్రాంతాల్లో ముస్లిం ఓట‌ర్లు అభ్య‌ర్థుల జ‌యాప‌జ‌యాల‌ను త‌ప్ప‌కుండా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఎంఐఎం దృష్టిపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఏపీ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం బ‌హుముఖ పోరు నెల‌కొంది. అధికారం నిల‌బెట్టుకునేందుకు టీడీపీ శాయ‌శ‌క్తులు అడ్డుతోంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని వైసీపీ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ కాద‌న్న రీతిలో ఇరు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన దూసుకొస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. విజ‌యావ‌కాశాలు పెద్ద‌గా లేకున్నా బీజేపీ కూడా చాలాచోట్ల అభ్య‌ర్థుల త‌ల‌రాత‌ల‌ను తారుమారు చేయ‌గ‌ల‌దు. ఈ నేప‌థ్యంలో ఎంఐఎం కూడా రాష్ట్రంలో ప్ర‌వేశిస్తే స‌మీక‌ర‌ణాలు టైట్ గా మారే అవ‌కాశ‌ముంది. ఎంఐఎంను పంపించి ఓట్లు చీల్చ‌డ‌మే చంద్ర‌బాబుకు కేసీఆర్ ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.