Begin typing your search above and press return to search.

చిన జీయర్‌స్వామికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్?

By:  Tupaki Desk   |   28 March 2022 4:34 AM GMT
చిన జీయర్‌స్వామికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్?
X
గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్, స్వామిజీ రామానుజ చినజీయర్ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి. పుకార్ల ప్రకారం.. ఫిబ్రవరి 5న 216 అడుగుల రామానుజాచార్య విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తన పేరును చేర్చకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి.

కాగా.. 2021 అక్టోబర్‌లో కేసీఆర్ తన ఆశ్రమానికి వచ్చిన సందర్భంగా మహా కుంభాభిషేకం నిర్వహించి మార్చి 28వ తేదీ ఉదయం 11.55 నిమిషాలకు మిథున లగ్నంలో యాదాద్రి ఆలయ సంప్రోక్షణకు ముహూర్తం ఫిక్స్ చేశారు చిన జీయర్.. తాజాగా యాదాద్రిలో పునర్నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభమయ్యాయి.

కానీ ప్రముఖ వైష్ణవ గురు చినజీయర్‌ని ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఆహ్వానించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. యాదాద్రి ఆలయ పనుల వెనుక ఆయన ఆధ్యాత్మిక శక్తిగా చినజీయర్ స్వామి ఇన్నాళ్లు ఉన్నారు.

అయిన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపకపోవడంతో ఈ కార్యక్రమానికి చినజీయర్ దూరమయ్యే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయానికి ఆగమ సలహాదారుగా చినజీయర్ ఉన్నందున ఇది చాలా మందిని షాక్‌కు గురి చేసింది. చినజీయర్ మొదటి నుండి ఆలయాన్ని ఆగమశాస్త్రాల ప్రకారం.. ఆలయ నిర్మాణం.. ఆచారాలను నిర్ణయించాడు.

ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం.. చిన జీయర్ స్వామి చేతుల మీదుగానే యాదాద్రి ఆలయ హోమాలు.. సంప్రోక్షణ కార్యక్రమాల మొత్తం మార్గనిర్దేశం చేయవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆయనను ఈ వేడుకకు ఆహ్వానించలేదు. కేసీఆర్‌ తోపాటు ఇతర గురువులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వివిధ దేవాలయాల ఋత్విక్కులు.. వేద పండితులను దేవాదాయ శాఖ నియమించింది.

చిన జీయర్ సహా ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం అందలేదని యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ గీతారెడ్డి ఈరోజు ధ్రువీకరించారు. నివేదిక ప్రకార.. మొత్తం పరిస్థితి జరిగిన తరువాత, ప్రభుత్వం తనకు ఇకపై బాధ్యత ఇచ్చే అవకాశం లేదని గ్రహించిన చిన జీయర్ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న సీతానగరంలో తన ఆశ్రమానికి బయలుదేరినట్టు తెలిసింది. దీన్ని బట్టి కేసీఆర్ కు, చినజీయర్ స్వామికి చెడిందని అర్థమవుతోంది.