Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ కు వెళ్లిన గంటకే సిటీకి కేసీఆర్!

By:  Tupaki Desk   |   2 Nov 2016 6:06 AM GMT
ఫాంహౌస్ కు వెళ్లిన గంటకే సిటీకి కేసీఆర్!
X
ఎర్రవల్లిలోని ఫాంహౌస్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్యనున్న అనుబంధం ఎలాంటిదన్నది తెలుగు ప్రజలకు చాలా బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చిన దాని కంటే.. ఎన్నో రెట్లు ఎర్రవల్లి ఫాంహౌస్ లో గడిపారనటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం లభించినా.. ఫాంహౌస్ కి వెళ్లిపోయే కేసీఆర్.. అక్కడే మూడు నాలుగు రోజుల పాటు ఉండిపోయిన వైనాన్ని మర్చిపోలేం.

అలాంటి కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రెండు రోజలు విశ్రాంతి కోసం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆయన.. కేవలం గంట వ్యవధిలో హుటాహుటిన హైదరాబాద్ మహానగరానికి తిరిగి వచ్చేయటం పలువురిని ఆకర్షించేలా చేసింది. షెడ్యూల్ ప్రకారం రెండు రోజులు ఫాంహౌస్ లో ఉండాల్సిన కేసీఆర్.. అంత హడావుడిగా తిరిగి ఎందుకు వచ్చేసినట్లు? అన్న ప్రశ్నకు ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు.

ఇటీవల ఏపీ – ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో పాటు.. బోపాల్ లోని జైల్లో ఉన్న సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న వ్యవహారంలో గంటల వ్యవధిలోనే ఎనిమిది మందిని ఎన్ కౌంటర్ లో హతం కావటంపై నిఘా వర్గాలు హైఅలెర్ట్ ప్రకటించాయి. అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులపై మావోల గురి ఎక్కువగా ఉందని.. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజాప్రతినిధులపై దాడులకు అవకాశం ఉందన్న హెచ్చరిక జారీ అయినట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండటం ఏ మాత్రం క్షేమకరం కాదని నిఘా వర్గాలు తేల్చి చెప్పటంతో పాటు..తెలంగాణ అధికారపక్ష నేతలంతా గ్రామాల్ని వదిలి.. సమీప పట్టణాలకు వెళ్లిపోవాలని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సర్కారులో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి హరీశ్ రావును కూడా హైదరాబాద్ కు వెంటనే వచ్చేయాలని నిఘా వర్గాలు సూచన చేయటంతో ఆయన.. హుటాహుటిన నగరానికి వచ్చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/