Begin typing your search above and press return to search.

నోట్ల రద్దుపై కేసీఆర్ చెప్పిన ఐబీ రిపోర్ట్ డిటైల్స్

By:  Tupaki Desk   |   18 Dec 2016 5:03 AM GMT
నోట్ల రద్దుపై కేసీఆర్ చెప్పిన ఐబీ రిపోర్ట్ డిటైల్స్
X
ప్రధాని తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి అభిప్రాయం ఏమిటి? క్యూ లైన్లలో గంటల తరబడి వెయిట్ చేస్తున్న వారెంత ఆగ్రహానికి గురి అవుతున్నారు. తాము రోజుల తరబడి నిలబడినా డబ్బులు రాకుంటే.. కొందరు బడా బాబులకు మాత్రం అందుకు భిన్నంగా కోట్లాది రూపాయిలు రావటంపై జనాల్లో మండిపాటు ఎంతలా ఉందన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. ఇలాంటి చాలా సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్.

నోట్ల రద్దును బాహాటంగా సమర్థిస్తున్న కేసీఆర్.. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఇష్యూలో మోడీకి అండగా నిలిచారనే చెప్పాలి. నోట్ల కష్టాలు తప్పవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిన ఆయన.. నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయంపై తనకు అందించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వివరాల్ని వెల్లడించారు. చాలా సర్వేల్లో 65 శాతానికి మించి ప్రజలు మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని.. మద్దతు పలుకుతున్నట్లుగా చెప్పారు.

ప్రజల శాశ్వితమని.. గొప్పదేశంగా ఉండటం ముఖ్యమని.. నల్లధనం తీసేయాలన్న ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మనం కూడా మన ప్రయత్నంగా మద్దతిద్దాం.. ప్రధానమంత్రి సక్సెస్ అవుతారో లేదో చూద్దాం.. మంచి జరిగితే అందరం ఆహ్వానిద్దాం.. చెడు జరిగితే అందరం సమిష్టిగా పోరాడతాం అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ముస్లింలు సైతం స్వాగతిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. రాజకీయ పార్టీలంటే ప్రజల్లో ఒకవిధమైన చులకనభావం ఉందని.. నల్లధనం పోతే వారిపట్ల గౌరవం పెరుగుతుందన్నారు. అన్ని వ్యవస్థలు ప్రక్షాళన అవుతాయని ప్రధాని చెబుతున్నారని.. అదే జరిగితే అద్భుతం.. బ్రహ్మాండం జరిగినట్లేనని.. అందుకే తాము రద్దు నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. మంచి జరిగితే దేశ వ్యాప్తంగా సమూల మార్పు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్.. నోట్ల రద్దు కారణంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టమన్న విషయం జనవరిలో తెలుస్తుందన్నారు.

ఎవరి దగ్గరా బ్లాక్ మనీ లేకపోతే బ్లాక్ మనీ ఆలోచనలు మాయమవుతాయన్న కేసీఆర్.. ఈ సందర్భంగా నోట్ల రద్దు నేపథ్యంలో తన వరకు తనలో వచ్చిన ఒక ఆసక్తికరమార్పును చెప్పుకొచ్చారు. గతంలో తాను తన మనమడికి డబ్బులు ఇచ్చేవాడినని.. కానీ.. ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వటం లేదన్నారు. డబ్బుల మీద అందరిలోనూ క్రమశిక్షణ పెరుగుతోందని చెప్పిన ఆయన.. మనమడి ముచ్చట చెప్పటం ద్వారా నోట్ల రద్దు తనపై ఎంత ప్రభావాన్ని చూపిందన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/