Begin typing your search above and press return to search.

కొత్త సర్వే ముచ్చట చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   13 Oct 2016 5:16 AM GMT
కొత్త సర్వే ముచ్చట చెప్పిన కేసీఆర్
X
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆ ఉత్సాహమే వేరు. అందులోకి సవాలక్ష‌ పంచాయితీల మధ్య.. ఏదైనా జరుగుతుందా? అన్న సందేహాల నడుమ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే కాన్ఫిడెన్స్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. ఏడాదిగా సాగుతున్న కొత్త జిల్లాల కసరత్తు కొలిక్కి రావటమే కాదు.. అనుకున్న దాని కన్నా ఎక్కువ జిల్లాల్ని ఏర్పాటు చేయటమే కాదు.. ఆఖరి నిమిషంలో చేసిన మార్పులతో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా కొత్త జిల్లాల‌ ఎపిసోడ్ విజయవంతంగా పూర్తి కావటం తెలిసిందే.

ఈ సంతోషంలో ఉన్న వేళ.. కేసీఆర్ నోటి నుంచి ఆసక్తికరమైన మాట ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కానీ జరిగితే.. తెలంగాణ వ్యాప్తంగా విపక్షాలకు ఏడెనిమిది సీట్లకు మించి రావని ప్రకటించారు. తనకు వచ్చిన కొత్త సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయన్న కేసీఆర్.. మరో ముచ్చట కూడా చెప్పారు. తన మిత్రుడైన మజ్లిస్ కు గట్టిపోటీ ఇచ్చేలా పాతబస్తీలో టీఆర్ ఎస్ బలపడిందని.. అయితే.. తమతో పోలిస్తే స్వల్ప అధిక్యంతో మజ్లిస్ ఏడు స్థానాల్ని నిలబెట్టుకుంటుందని చెప్పారు.

మజ్లిస్ కు అడ్డా అయిన పాతబస్తీలో ఆ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి టీఆర్ ఎస్ ఎదిగిందన్న కేసీఆర్.. అక్కడ కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 48:38 నిష్పత్తిలో ఓట్లు పోలవుతాయని చెప్పుకొచ్చారు. మిత్రుడికి బలమైన పోటీ ఇచ్చేలా తమ పార్టీ ఎదిగిందని చెబుతూనే.. మిత్రుడి ఇగోకి ఇబ్బంది కలగకుండా కేసీఆర్ చెప్పిన తాజా సర్వే ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తావివ్వటం ఖాయం. ఇంతకీ.. ఈ సర్వే ఎప్పుడు.. ఎవరు నిర్వహించారన్న విషయాన్ని మాత్రం కేసీఆర్‌ వెల్లడించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/