Begin typing your search above and press return to search.

వాళ్లంద‌రి తాట హోల్ సేల్ గా తీయ‌మ‌న్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   17 July 2017 5:01 AM GMT
వాళ్లంద‌రి తాట హోల్ సేల్ గా తీయ‌మ‌న్న కేసీఆర్‌
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కోపం వ‌చ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. ర‌క్తం మ‌రిగిపోయేలా.. మ‌న‌సు చ‌లించేలా ఆగ్ర‌హం వ‌చ్చింద‌ట‌. ఆ విష‌యాన్ని ఎవ‌రో చెప్ప‌లేదు.. ఆయ‌న‌కు ఆయ‌నే చెప్పుకున్నారు. ఇటీవ‌ల కాలంలో బ‌య‌ట‌కు వ‌స్తున్న క‌ల్తీలు.. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో ఆయ‌న మ‌న‌సు తీవ్రంగా బాధ‌ప‌డుతోంద‌ట‌. అందుకే.. క‌ల్తీల మీదా.. డ్ర‌గ్స్ మీద ఉక్కుపాదం మోపాల‌ని.. అక్ర‌మార్కుల తాట తీయాల‌ని.. ఇందుకు ఎలాంటి మొహ‌మాటాల‌కు గురి కావొద్ద‌ని ఆయ‌న చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆదివారం ఉద‌యం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో క‌ల్తీలు.. మాద‌క‌ద్ర‌వ్యాల అంశంపై మంత్రులు.. పోలీసు ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి భేటీ నిర్వ‌హించిన కేసీఆర్‌.. సుదీర్ఘంగా మాట్లాడిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా అంద‌రి ముందు డ్ర‌గ్స్ కేసును ప్ర‌స్తావిస్తూ.. దాని అంతు చూడాల్సిందిగా స్ప‌ష్టం చేశారు. ఎలాంటి ఒత్తిడి ఉండ‌ద‌ని.. నేర‌స్తుల తాట తీసేందుకు ఏ మాత్రం వెనుకాడొద్ద‌ని.. ఎంత‌టి వారినైనా వ‌ద‌లొద్ద‌ని.. ఒక‌వేళ మంత్రులు ఉన్నా వారిపైనా కేసులు న‌మోదు చేయాల్సిందే త‌ప్పించి వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని స్ప‌ష్టం చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. డ్ర‌గ్స్ కేసులో పెద్ద‌ల ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతోంద‌ని.. కేసును నిర్వీర్యం చేసేందుకు ఉన్న‌త‌స్థాయిలో పావులు క‌దుపుతున్నార‌ని.. ఈ విష‌యం మీద ఇక జ‌రిగేదేమీ లేదంటూ వినిపిస్తున్న వాద‌న‌ల‌కు భిన్నంగా కేసీఆర్ నోట క‌టువైన మాట‌లు రావ‌టం గ‌మ‌నార్హం.

అంతేనా.. డ్ర‌గ్స్ రాకెట్ కేసు కీల‌క‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు సెల‌వులో వెళుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ ను సెల‌వు మీద వెళ్లొద్ద‌ని తానే కోరిన‌ట్లుగా కేసీఆర్ భేటీలో త‌న‌కు తానుగా వెల్ల‌డించారు. మాద‌క ద్ర‌వ్యాల కేసు ప‌రిశోధ‌న‌లో ఉన్న స‌మ‌యంలో సెల‌వు మీద వెళ్లొద్ద‌ని నేనే అకున్ స‌బ‌ర్వాల్‌ కు సూచించాను.. కేసు పూర్వ‌ప‌రాల‌న్నీ క్షుణ్ణంగా వెలికితీయాల‌ని ఆయ‌న ఆదేశించారు. అంతేనా.. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడ‌టం అత్యంత అవ‌స‌ర‌మ‌ని.. రాజ‌ధానే తెలంగాణ‌కు జీవ‌నాడి అని.. ఇక్క‌డ ఆరాచ‌కాలు అంతం కావాల‌ని తేల్చి చెప్పారు.

క‌ల్తీల మీద నిత్యం వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించిన ఆయ‌న‌.. ర‌క్తాన్నికూడా క‌ల్తీ చేసి అమ్ముతున్నార‌న్న విష‌యం తెలిసిన వెంట‌నే మ‌న‌సెంతో చ‌లించిపోయిందని.. బ‌తికిస్తాడ‌ని న‌మ్మి వ‌చ్చిన వారిని చంపుతారా? అంటూ తీవ్రంగా ప్ర‌శ్నించిన కేసీఆర్‌.. ఇలాంటి వారిని అస్స‌లు వ‌దలొద్ద‌ని.. ఈ త‌ర‌హా నేరాల‌కు జీవిత‌కాల‌శిక్ష ప‌డేలా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేయొచ్చేమో చూడాల‌ని అధికారుల్ని కోరారు.

క‌ల్తీల‌కు పాల్ప‌డ‌టం.. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా వంటి దుర్మార్గాలు తెలంగాణ‌లో చేయ‌లేమంటూ అక్ర‌మార్కులు భ‌య‌ప‌డి పారిపోయేలా క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌న్న కేసీఆర్‌.. నిజాయితీగా ప‌ని చేస్తున్న అధికారుల‌కు పూర్తి ప‌వ‌ర్స్ ఇస్తామ‌ని.. కావాల్సిన బ‌లం.. బ‌ల‌గాల్ని ఇస్తామ‌న్నారు. కేసుల ప‌రిశోధ‌న‌లో ఎవ‌రూ క‌లుగ‌జేసుకోర‌ని.. మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్ప‌టం విశేషం. తాజా భేటీ అనంత‌రం డ్ర‌గ్స్ మీద అధికారుల విచార‌ణ మ‌రింత వేగ‌వంతం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. కేసీఆర్ లాంటి నేత‌కు కాలిపోయేంత కోపం వ‌స్తే.. అదెంత మాత్రం మామూలు విష‌యం కాబోదు. మొత్తానికి అక్ర‌మార్కుల‌కు బ్యాడ్ టైం మొద‌లైపోయిన‌ట్లే.