Begin typing your search above and press return to search.

కేసీఆర్ అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   7 April 2017 4:47 AM GMT
కేసీఆర్ అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లేనా?
X
రాజ‌కీయాల్లో అనుకోకుండా జ‌రిగేవి చాలా చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అనుకున్న‌వి మాత్ర‌మే ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. కొన్ని విష‌యాల్లో చెప్పే మాట‌ల‌కు.. చేసే ప‌నుల‌కు ఏమాత్రం సంబంధం ఉండ‌దు. ఈ మ‌ధ్య‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్యం స‌రిగా లేద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంది. అందులో భాగంగానే శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఆయ‌న భ‌ద్రాచ‌లంలో నిర్వ‌హించిన క‌ల్యాణానికి హాజ‌రు కాలేద‌న్న విష‌యం తెలిసిందే. మ‌రి.. పండ‌గ రోజున ఆరోగ్యం స‌రిగా లేని కేసీఆర్ గురువారం నాటికి సెట్ అయిన‌ట్లుగా క‌నిపించింది.

బుధ‌వారం స్వ‌ల్ప అనారోగ్యంతో భ‌ద్రాచ‌లంలో నిర్వ‌హించి క‌ల్యాణానికి వెళ్ల‌ని కేసీఆర్‌.. గురువారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ లో మంత్రులు క‌డియం శ్రీహ‌రి.. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ‌.. సీఎస్ ఎస్పీ సింగ్ త‌దిత‌రుల‌తో కూడిన బృందంతో గొర్రెల పెంప‌కం ప‌థ‌కానికి మార్గ‌ద‌ర్శ‌కాల రూప‌క‌ల్ప‌న విష‌యంపై ఆయ‌న రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు.

ఈ మ‌ధ్య‌న ఎక్కువ‌గా గొర్రెపిల్ల‌ల మీద ఫోక‌స్ చేస్తున్న‌కేసీఆర్‌.. య‌థావిధిగా తాజా స‌మీక్ష‌లోనూ కొత్త కొత్త అంశాల్ని తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. ప‌లు ప్లాన్లను సిద్ధం చేశారు. తొల‌క‌రి జ‌ల్లులు ప‌డిన వెంట‌నే గొర్రెపిల్ల‌ల్ని కొనుగోలు చేయాల‌ని.. రాష్ట్రంలోని 4 ల‌క్ష‌ల వ‌ర‌కూ యాద‌వ‌.. కురుమ కుటుంబాలు ఉన్నాయ‌ని.. ఒక‌వేళ లెక్క‌లో ఓ 50 వేల మంది ఎక్కువ‌గా ఉన్నా.. ముందుగా అనుకున్న‌ట్లు గొర్రె పిల్ల‌ల యూనిట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకు త‌గ్గ‌ట్లు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. గొర్రెపిల్ల‌ల్ని పెంచ‌టానికి ముందుక వ‌చ్చే ప్ర‌తి గొల్ల‌.. కుర్మ కుటుంబాల్లో 18 ఏళ్ల‌కు పైబ‌డి వ‌య‌సున్న వారి పేర్లు అన్ని రిజిష్ట‌ర్ చేయాల‌ని.. ఒక్కొక్క కుటుంబానికి 20 గొర్రెలు.. ఒక‌పొట్టేలు ఉన్న యూనిట్ (సుమారు రూ.1.25ల‌క్ష‌ల వ‌రకు విలువ ఉండే అవ‌కాశం)ను అంద‌జేసేలా ప్రణాళిక‌ల్ని సిద్ధం చేయాల‌ని సూచించారు. ఇలా ప్ర‌తి అంశాన్ని సునిశితంగా.. సుదీర్ఘంగా రివ్యూ చేసిన కేసీఆర్‌ను చూస్తే.. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డింద‌ని.. స్వ‌ల్పఅస్వ‌స్థ‌త నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/