Begin typing your search above and press return to search.

మాటల‌తో కేసీఆర్ ప్ర‌స్థానం.. కానీ, ఇప్పుడు డ‌బ్బులతో ఎందుకు ప‌రిస్థితి?

By:  Tupaki Desk   |   16 Aug 2021 2:30 PM GMT
మాటల‌తో కేసీఆర్ ప్ర‌స్థానం.. కానీ, ఇప్పుడు డ‌బ్బులతో ఎందుకు  ప‌రిస్థితి?
X
ఆయ‌న పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌. నోరు విప్పితే.. మాట‌ల తూటాలు.. విమ‌ర్శ‌ల శ‌త‌ఘ్నులు.. అల‌వోక‌గా కురుస్తాయి. ఆయ‌న మాట ప్ర‌భంజ‌నం.. ఆయ‌న ప‌లుకు ప్ర‌జానినాదం.. మాట‌ల మాత్రికుడిగా ఆయ‌నకు ఘ‌న కీర్తి... ప‌ల్లె నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆయ‌న మాట ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించింది. ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప జేసింది. ఆయ‌నే.. తెలంగాణ సార‌థి.. తెలంగాణ సాంస్కృతిక నినాద వార‌ధి.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు. ఉర‌ఫ్ కేసీఆర్. త‌న మాట‌ల‌తో ప్ర‌జ‌ల మ‌నసు దోచుకున్న ఏకైక నాయ‌కుడు!

రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలో సాగిన ఉద్య‌మం.. హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపించిందంటే.. కేవలం కేసీఆర్ వ‌క్చాతుర్యం కార‌ణంగానే.తెలంగాణ సెంటిమెంటును ర‌గిలించి.. ప్ర‌తి ఒక్క‌రినీ ఉద్య‌మం దిశ‌గా న‌డిపించిన కేసీఆర్‌.. అప్ప‌టి యూపీఏ స‌ర్కారును త‌న‌దైన శైలిలో త‌న వైపు తిప్పుకొని రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం ఇచ్చింది.. సోనియానే అయినా.. మాట‌ల మాంత్రికుడు, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. కేసీఆర్ వేసిన అడుగుల‌తోనే ప్ర‌త్యేక రాష్ట్రం సాధ్య‌మైంది. కేసీఆర్‌-తెలంగాణ వేర్వేరు కాదంటే అతిశ‌యోక్తి కాదు. కేసీఆర్ అంటే.. తెలంగాణ‌, తెలంగాణ అంటే... కేసీఆర్ అన్న‌విధంగా.. పాలు తేనెగా క‌లిసిపోయిన ద్వ‌యం ఇది ఒక్క‌టే!

మీడియా ముందుకు వ‌చ్చినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య నిల‌బ‌డినా.. కేసీఆర్ వ్యాఖ్య‌లు, ఆయ‌న చేసే కామెంట్లే ఆయ‌న‌కు కొండంత బ‌లం! ఆయ‌న వాక్చాతుర్యం ముందు.. కండ‌లు తిరిగిన రాజ‌కీయ యోధుడు కూడా కుదేలు కావాల్సిందే. ఆయ‌న డ‌బ్బు పెట్టి.. ప్ర‌జ‌ల అబిమానం చూర‌గొన‌లేదు.. ఆయ‌న డ‌బ్బుతో రాష్ట్రాన్ని తీసుకురాలేదు. ఆయ‌న డ‌బ్బుతో త‌నవైపు ప్ర‌జ‌ల‌ను తిప్పుకోలేదు. కేవ‌లం మాట‌.. త‌న‌దైన శైలి.. ఇవే. కేసీఆర్‌కు పెట్ట‌ని కోట‌లు! ఈ మాట‌ల‌తోనే ఆయ‌న రెండు ప‌ర్యాయాలు అధికారంలోకి వ‌చ్చారు. తెలంగాణ వాదాన్ని బ‌లంగా తీసుకువెళ్లి.. ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్నారు.

అలాంటి కేసీఆర్‌లో ఇప్పుడు అనూహ్య మార్పు. నిజ‌మేనా? అంటే.. నిజ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు ఆయ‌న మాట‌లు ప‌నిచేయ‌డం లేదా? ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. ఆవిష‌యం చెప్ప‌లేం కానీ.. కేసీఆర్ మాత్రం త‌నంత‌ట తానే.. డ‌బ్బులు కుమ్మ‌రించేందుకు రెడీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత‌.. ముఖ్యంగా కేసీఆర్ రెండో ద‌ఫా అధికారంలోకి వ‌చ్చాక‌.. జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో డ‌బ్బులు వెద‌జ‌ల్లుతున్నార‌నే ఆరోప‌ణ‌లు పెరిగిపోయాయి. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో నిండుకుండ‌గా ఉన్న.. తెలంగాణ ఖ‌జానా.. త‌ర్వాత ఒట్టిపోయింది.

లోటు బ‌డ్జెట్‌తో అల్లాడుతున్న ఏపీ వంటి రాష్ట్రాల‌తో పోటీ ప‌డుతూ.. తెలంగాణ అప్పులు చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. కేసీఆర్ వ్యూహం మారిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎప్పుడూ.. మాట‌ల‌తో రాజ‌కీయం చేయ‌లేమ‌ని.. ఎంత‌సేపూ.. ప్ర‌జ‌ల‌ను మాట‌ల‌తో త‌న‌వైపు తిప్పుకోలే మ‌ని ఆయ‌న నిశ్చితాభిప్రాయంతో ఉన్న‌ట్టు చెబుతున్నారు. అందుకే ఆయ‌న డ‌బ్బుల రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎక్క‌డ ఎప్పుడు ఉప ఎన్నిక జ‌రిగినా.. కేసీఆర్ డ‌బ్బుల‌తో కొడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

అదేస‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాల‌కు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ ల జ‌రిగిన నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ ఇదే త‌ర‌హా వ్యూహం క‌నిపించింది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక విష‌యంలోనూ .. కేసీఆర్ ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారని అంటున్నారు. అంటే.. దీనిని బ‌ట్టి.. రాష్ట్రం ఏదిశ‌గా అడుగులు వేస్తోంద‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. కేవ‌లం ఓట్ల కోస‌మే.. కేసీఆర్ ఇలా చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఒక‌ప్పుడు త‌న మాట‌ల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్న కేసీఆర్‌.. ఇప్పుడు డ‌బ్బులు.. ఉచిత ప‌థ‌కాల వైపు మ‌ళ్లుతున్నారంటే.. ప్ర‌జ‌ల్లో ఏదైనా మార్పు వ‌చ్చిందా? లఏక‌.. ఆయ‌నే మారారా? అనే సందేహ‌లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏదేమైనా.. అభివృద్ధి చేస్తే.. ఈ ఉచితాల వైపుప్ర‌జ‌లు మొగ్గు చూపర‌ని.. దీనిని వ‌దిలేసి.. కేవ‌లం మాటల రాజ‌కీయం చేయ‌డం వ‌ల్లే.. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు.