Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షం లేని అసెంబ్లీని ఏం ఏలుతావ్ కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   7 Jun 2019 7:36 AM GMT
ప్ర‌తిప‌క్షం లేని అసెంబ్లీని ఏం ఏలుతావ్ కేసీఆర్‌?
X
అధికార‌ప‌క్షాన్ని హీరోగా.. ప్ర‌తిప‌క్షాన్ని విల‌న్ గా పోల్చ‌లేం. కానీ.. విష‌యం అర్థం కావ‌టానికి మాత్ర‌మే మేమిప్పుడు చెప్పే పోలిక‌. ఇట్టే అర్థం కావ‌టానికి వీలుగా మాత్ర‌మే తాజా పోలిక తీసుకున్న వైనాన్ని మ‌ర్చిపోవ‌ద్దు. ఒక సినిమాలో హీరోయిజం ఎలివేట్ కావాలంటే విల‌న్ అందుకు ధీటుగా ఉండాలి. రాజ‌మౌళి సినిమాలో చూస్తే హీరో కంటే విల‌న్ బ‌లంగా ఉంటాడు. అమేయ‌మైన శ‌క్తియుక్తులు ఉంటాయి. అలాంటి జెయింట్ తో త‌ల‌ప‌డిన హీరో విజ‌యం సాధిస్తే.. ప్రేక్ష‌కుల‌కు క‌లిగే ఫీల్ మామూలుగా ఉండ‌దు.

సినిమా గురించి వ‌దిలేద్దాం. వాస్త‌వంలోకి వ‌ద్దాం. ప్ర‌జాస్వామ్యంలో అధికార‌ప‌క్షం స‌మ‌ర్థ‌త తెలిసేదెప్పుడు? అంటే.. విప‌క్షం విరుచుకుప‌డుతున్న‌ప్పుడు.. వారి మాట‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పంచ్ లు వేస్తూ.. వారు విసురుతున్న ఉచ్చుల్లోకి చిక్కుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ప్పుడు వ‌చ్చే ఆనందం.. విప‌క్ష‌మే లేన‌ప్పుడు వ‌స్తుందా? అంటే లేద‌ని చెప్పాలి. విప‌క్షం ఎప్పుడైనా అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేస్తే.. అసెంబ్లీ స‌మావేశాల్ని చూడాల‌నుకునే వారు సైతం చూడ‌ని ప‌రిస్థితి.

ప్రజాస్వామ్యంలో అధికార‌ప‌క్షం ఎంత ముఖ్య‌మో.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష ఉనికి అంతే ముఖ్యం. పాల‌క వ‌ర్గాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శ్నిస్తూ.. వారి త‌ప్పుల్ని ఎత్తి చూపే తీరుతో త‌మ‌ను తాము క‌రెక్ట్ చేసుకోవ‌టానికి ఊత‌క‌ర్ర‌గా ప్ర‌తిప‌క్షం అధికార‌ప‌క్షానికి మారుతుంది. ఈ చిన్న విష‌యాన్ని క‌నుగొన్న వారు ఒక‌లా ఉంటే.. అందుకు భిన్నంగా ఉన్న వారు అభాసుపాల‌వుతుంటారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ఎస్ లో క‌లిపేసుకున్న తీరు చూసిన‌ప్పుడు మాత్రం ఆవేద‌న క‌ల‌గ‌టం ఖాయం.

ఎందుకంటే.. తెలంగాణ‌లో ప్ర‌భుత్వానికి స‌వాలు విసిరే స‌మ‌ర్థ విప‌క్షం లేన‌ప్పుడు పాల‌న ఏదో సాగుతుందంటే సాగుతుంద‌న్నట్లుగా ఉంటుందే త‌ప్పించి.. ఎలాంటి వృద్ధి క‌నిపించ‌దు. ప్ర‌జాస్వామ్యం బ‌లంగా ఉండాలంటే బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం అవస‌రం. సుదీర్ఘ కాలం ఉద్య‌మాన్ని న‌డిపి.. రాజ‌కీయ పార్టీని న‌డ‌ప‌టంలో డ‌క్కామొక్కీలు తిన్న కేసీఆర్ లాంటి నేత‌కు తెలియ‌ని విష‌యాలు కావు.

అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు ప‌లువురి విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటోంది. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందిని త‌న వ‌ర్గంగా మార్చేసుకున్న కేసీఆర్ తీరు విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా చేస్తోంది. వాస్త‌వానికి తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌ని చెప్పాలి. మొత్తం తానై షో ర‌న్ చేయ‌టాన్ని చైత‌న్య‌వంతులైన తెలంగాణ ప్ర‌జ‌లు హ‌ర్షించ‌రు. అదే జ‌రిగితే.. ఏం కోరుకున్నారో దానికి భిన్న‌మైన ప‌రిస్థితులు కేసీఆర్ కు ఎదురుకాక త‌ప్ప‌దు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం అన్న‌ది లేన‌ట్లే. అంతేనా.. మ‌జ్లిస్ కు ఉన్న ఏడు స్థానాల కంటే కాంగ్రెస్ బ‌లం త‌గ్గిపోయిన నేప‌థ్యంలో కాంగ్రెస్ ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా మారిపోనుంది. వ‌న్ మ్యాన్ ఆర్మీ మాదిరి.. వ‌న్ మ్యాన్ షోను ప్ర‌ద‌ర్శిస్తాన‌ని ఉబ‌లాటం ప్ర‌ద‌ర్శిస్తున్న కేసీఆర్ కార‌ణంగా.. విప‌క్ష‌మే లేని స‌భ‌గా అసెంబ్లీ మారుతుంది. అలాంటి వేళ‌లో.. ప్ర‌జాస‌మ‌స్య‌లు.. ఇబ్బందుల గురించి ప్ర‌స్తావించే వారే ఉండ‌రు. ఇదంతా చూస్తే.. విప‌క్షం లేని తెలంగాణ‌ అధికార‌ప‌క్షం దుష్ట సంప్ర‌దాయానికి తెర తీసిన‌ట్లుగా చెప్పాలి. ఒంటెద్దు పోక‌డ‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ తీరు ప్ర‌జ‌లకు ఆగ్ర‌హం క‌లిగిస్తే.. ఏపీలో ఇటీవ‌ల వెలువ‌డిన ఫ‌లితాల‌కు త‌గ్గ‌ట్లే తెలంగాణ ప్ర‌జ‌లు కూడా తీర్పు ఇస్తార‌న్న చిన్న పాయింట్ ను కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు. తాజాగా తాను చేస్తున్న ప‌నుల‌కు మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఒక అంశంగా ప‌రిగ‌ణిస్తున్నారా? అదే ఉంటే.. ప్ర‌తిప‌క్షం అన్న‌ది లేకుండా చేసే సాహ‌సం చేస్తారా?