Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ది రైతు బంధు!... జ‌గ‌న్‌ ది రైతు భ‌రోసా!

By:  Tupaki Desk   |   6 Jan 2019 2:49 PM GMT
కేసీఆర్‌ ది రైతు బంధు!... జ‌గ‌న్‌ ది రైతు భ‌రోసా!
X
తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తుగా జ‌రిగిన ఎన్నిక‌ల కంటే ఓ ఏడాది ముందుగా తెర‌పైకి వ‌చ్చిన రైతు బంధు ప‌థకం... ఎన్నికల్లో టీ ఆర్ ఎస్‌ కు మంచి మైలేజీనే తెచ్చింది. రైతు బంధు ప‌థ‌కం ద్వారా రైతుల ఖాతాల్లో జ‌మ అయిన రెండో విడ‌త నిధులు టీ ఆర్ ఎస్‌ కు ఓట్ల పంట‌ను పండించాయ‌న్న విశ్లేష‌ణ‌లు లేక‌పోలేదు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా ప‌థ‌కం ప్ర‌కారం ఈ ప‌థ‌కాన్ని తెర మీద‌కు తెచ్చిన కేసీఆర్‌... స‌రిగ్గా... పోలింగ్‌కు కాస్తంత ముందుగా రెండో విడ‌త నిధుల‌ను విడుద‌ల చేశార‌ని, ఈ నిధులు త‌మ ఖాతాల్లో జ‌మ అయి విష‌యాన్ని గుర్తించిన రైతులంతా... విప‌క్షాలు ఎన్ని మాట‌లు చెప్పినా గానీ... టీ ఆర్ ఎస్ త‌ప్పించి వారికి మ‌రో పార్టీ క‌నిపించ‌లేదు. ఈ కార‌ణంగానే టీ ఆర్ ఎస్‌ కు బంప‌ర్ మెజారిటీ ద‌క్కింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. బాగానే ఉంది మ‌రి.... రైతుల సంక్షేమం గురించి ఆలోచ‌న చేసే పార్టీల‌కు దాదాపుగా ఓట‌మ‌న్న‌దే ఉండ‌దు. ఇదే వాస్త‌వాన్ని గుర్తించిన ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా త‌దిత‌ర రాష్ట్రాలు ఇప్ప‌టికే కేసీఆర్ రైతు బంధును అమ‌లు చేసేందుకు రంగంలోకి దిగేశాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఇదే త‌ర‌హా ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేస్తున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌రి త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో ప‌రిస్థితి ఏమిటి? గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనూ చివ‌రి అంకంలో రైతుల‌కు రుణ‌మాఫీ ప్ర‌క‌టించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మైలేజీ సాధిస్తే... అమ‌లు సాధ్యం కాని ఈ హామీని తాను ఇవ్వ‌లేనంటూ స్ప‌ష్టంగా చెప్పేసిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విప‌క్షంలో కూర్చునేందుకు కూడా వెనుకాడ‌లేదు. ఇది గ‌తం అనుకుంటే... ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే తాను అధికారంలోకి వ‌స్తే న‌వ‌ర‌త్నాల పేరిట ఓ తొమ్మిది ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... వాటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతూనే... దేశ చ‌రిత్ర‌లోనే సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ యాత్ర కూడా మ‌రో రెండు, మూడు రోజుల్లో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో నిన్న ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భాగంగా చాలా అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న రైతు బంధు ప‌థ‌కాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. అస‌లు కేసీఆర్ రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌డానికి చాలా ముందే... అదే ప‌థ‌కం మాదిరిగా రైతు భ‌రోసా పేరిట తాను ఓ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాన‌ని, త‌మ పార్టీ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లో అది కూడా ఒక‌టి అని ఆయ‌న పేర్కొన్నారు.

పాద‌యాత్ర మొద‌లుపెట్ట‌క మునుపే గుంటూరు వేదిక‌గా నిర్వ‌హించిన త‌మ పార్టీ స‌భ‌లో ఈ ప‌థ‌కాన్ని తాను ప్ర‌క‌టించాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. మొత్తంగా కేసీఆర్ రైతు బంధు ప‌థ‌కం కంటే ముందుగానే తాను రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించాన‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రైతు బంధు కంటే కూడా తాను ప్ర‌క‌టించిన రైతు భ‌రోసానే రైతుల‌కు మ‌రింత‌గా ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని కూడా జ‌గ‌న్ పేర్కొన్నారు. తాను ప్ర‌క‌టించిన ప‌థ‌కంలో ప్ర‌తి ఎక‌రాకు రూ.12,500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జ‌మ చేస్తామ‌ని, అలా ఏడాదికి నాలుగు సార్లు... అంటే మొత్తంగా ఎక‌రం పొలం ఉన్న రైతు ఖాతాలోకి ఏకంగా రూ.50,000ల‌ను జ‌మ చేస్తామ‌ని చెప్పారు. ఈ లెక్క‌న చూస్తే... రైతు బంధు ప‌థ‌కం కంటే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన రైతు భ‌రోసా ఎన్నో రెట్లు మేల‌నే మాట వినిపిస్తోంది. సంక్షేమ పాల‌న‌లో ఇప్ప‌టికే వైఎస్ ఫ్యామిలీకి ఓ మంచి పేరుంది. అంతేకాకుండా దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అమ‌లు చేసిన సంక్షేమ పాల‌న మ‌రెవ‌రికీ సాధ్యం కాద‌న్న వాద‌న కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రైతు భ‌రోసాను ప‌రిశీలిస్తే... జ‌గ‌న్ చెబుతున్న రాజ‌న్న రాజ్యంలో సంక్షేమ పాల‌న కొత్త పుంత‌లు తొక్క‌నుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదేమో.