Begin typing your search above and press return to search.

సంక్రాంతి పండగను కేసీఆర్ అలా పూర్తి చేశారట

By:  Tupaki Desk   |   17 Jan 2020 4:12 AM GMT
సంక్రాంతి పండగను కేసీఆర్ అలా పూర్తి చేశారట
X
మూడు రోజుల సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అంతా బాగుంది కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పండగను ఎలా చేసుకున్నారు? గడిచిన మూడు రోజులుగా ఆయనకు సంబంధించిన వార్తలు పెద్దగా రావట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా.. మున్సిపల్ - కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న వేళ సారు ఎక్కడ ఉన్నట్లు? ఏం చేస్తున్నట్లు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోనే లేరన్న విషయం బయటకు వచ్చింది.

ఫాంహౌస్ రెండో ఇల్లుగా మారిపోయి.. ఎప్పుడు ప్రగతి భవన్ లో ఉంటారో.. మరెప్పుడు ఫాంహౌస్ లో ఉంటారన్న విషయం ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఈ సంక్రాంతి కేసీఆర్ సారుకు సో స్పెషల్ అని చెబుతున్నారు. ఫాంహౌస్ లో యుద్ధప్రాతిపదికన కొద్ది నెలలుగా కట్టిస్తున్న కొత్తిల్లు పూర్తి కావటమే కాదు.. మొన్నామధ్యనే గృహప్రవేశాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడదే ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసుకుంటే బాగుంటుందన్న వేద పండితుల సలహాతో సకుటుంబ సపరివార సమేతంగా ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రమే సీఎం కేసీఆర్.. ఆయన సతీమణి శోభ.. మనమడు హిమాన్షు తో కలిసి ఫామ్ హౌస్ వెళ్లారు. భోగి పండుగ వేళ కొత్తింట్లో ప్రత్యేక పూజలు చేశారట. సంక్రాంతి వేళ నాటికి కేటీఆర్ ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్ కు చేరుకున్నట్లు చెబుతున్నారు. బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో పాలు పొంగించే కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

కొత్తింట్లో కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను చేసుకున్న కేసీఆర్.. అందరూ కలిసి సహపంక్తి భోజనాన్ని చేశారట. కొత్తింటి ముందు రంగురంగులతో రంగవల్లులు వేయటం.. పండగను భారీగా జరుపుకున్నట్లు చెబుతున్నారు. కనుమ రోజు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు. మనమడు హిమాన్షు.. ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి ఫామ్ హౌస్ మొత్తం తిరిగినట్లుగా అక్కడి వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి కేసీఆర్ కు సో స్పెషల్ అని చెప్పక తప్పదు.