Begin typing your search above and press return to search.

గవర్నర్ మాటకు నో చెప్పిన కేసీఆర్ సర్కార్?

By:  Tupaki Desk   |   15 April 2020 7:30 AM GMT
గవర్నర్ మాటకు నో చెప్పిన కేసీఆర్ సర్కార్?
X
సాధారణంగా గవర్నర్ ఏదైనా సలహా.. సూచన ఇస్తే దానికి సానుకూలంగా స్పందిస్తుంటాయి ప్రభుత్వాలు. నిజానికి ఇలాంటి అంశాలు బయటకు రావు. మరేమైందో కానీ.. గవర్నర్ చేసిన సూచనకు ప్రభుత్వం నో చెప్పిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నర్ ఇచ్చిన సలహా ఏమేరకు ఆచరణ సాధ్యమన్న మదింపు ప్రభుత్వం చేయకుండా నో చెప్పేసినట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై చేసిన సూచన ఏమిటన్నది చూస్తే.. రాష్ట్రంలో కరోనా టెస్టులు చేసేందుకు ఆరు ప్రభుత్వ ల్యాబులతో పాటు.. మూడు ప్రైవేటు ల్యాబ్ లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మరిన్ని ప్రైవేటు ల్యాబుల భాగస్వామ్యం చేస్తే ఫలితం వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రస్తావించారు గవర్నర్.

ప్రైవేటు ల్యాబ్ లలో చేసే పరీక్షల ఫలితాలు పదిహేను నిమిషాల్లో వచ్చేలా ర్యాపిడ్ పరీక్ష కిట్లను కరోనా టెస్టులకు వినియోగించాలన్న సూచన కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయం మీద ప్రభుత్వ స్పందన బయటకు రాలేదు కానీ.. ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేసేందుకు వీలుగా అనుమతులు ఇవ్వటం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ స్థాయిలో ఒక సూచన వచ్చినప్పుడు.. దాని వెనకున్న అంశాలు.. ఏయే ప్రాతిపదికల మీద అలాంటి సలహా ఇచ్చారన్న విషయాన్ని కలిసి తెలుసుకోవాల్సింది పోయి.. సాధ్యం కాదన్న మాట చెప్పటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఈ వ్యవహారం బయటకు పొక్కటంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.