Begin typing your search above and press return to search.

గవర్నర్‌తో కేసీఆర్‌ ఆ మాట చెప్పారా?

By:  Tupaki Desk   |   27 Jun 2015 5:37 AM GMT
గవర్నర్‌తో కేసీఆర్‌ ఆ మాట చెప్పారా?
X
మిగిలిన నాయకులకు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా తేడా ఉంది. తాను అనుకున్న పనిని ఎవరూ ఊహించని విధంగా నెరవేర్చుకునే తెలివితేటలు ఆయన సొంతం. తెలంగాణ ఉద్యమాన్ని ఆందోళనలతో కంటే కూడా ఓటు రాజకీయంగా దెబ్బ కొట్టిన విధానం స్పష్టంగా కనిపిస్తుంది.

తెలంగాణ ఉద్యమం కాస్త తగ్గిందన్న వాదన తెరపైకి వచ్చిన ప్రతిసారీ.. ఆయన ఉప ఎన్నికకు తెర తీసేవారు. ఇలాంటి అపాయకరమైన జూదాన్ని ఆడేందుకు ఆయన ఏ మాత్రం సందేహించరు. ఉప ఎన్నికల్లో.. ఇష్టం ఉన్నా లేకున్నా తమ పార్టీకి ఓటు వేస్తేనే తెలంగాణ వస్తుందన్న తప్పనిసరి భావనను తెలంగాణ ప్రజల్లో కల్పించటంలో ఆయన విజయవంతం అయ్యారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి లాంటి ప్రజాకర్షక.. బలమైన నేత ఉన్న సమయంలోనూ ఆయన ఉప ఎన్నిక ద్వారా సెంటిమెంట్‌ను ఎంత బలంగా రాజేశారో తెలిసిందే. అలాంటిది తనకు ఎదురే లేని ప్రస్తుత కాలంలో.. తనపై మాటల దాడి చేసే ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ధి చెప్పటానికి మరోసారి ఎన్నికల జూదానికి తెర తీసేందుకు కేసీఆర్‌ సిద్ధం అవుతున్నారా? అంటే అవునన్న సమాధానం వినిపిస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తుంది.

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయిన గవర్నర్‌ నరసింహన్‌.. సెక్షన్‌ 8 అమలు అంశాన్ని తెలంగాణ సర్కారు బలంగా వ్యతిరేకిస్తుందన్న విషయాన్ని చెప్పటమే కాదు.. అవసరమైతే.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సైతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని.. ఆ మాట తనతో చెప్పారని గవర్నర్‌ చెప్పినట్లుగా ఒక ప్రచారం మొదలైంది.

ఈ విషయంలో నిజానిజాల సంగతి తేలాలంటే.. ఈ మాటను విన్న గవర్నర్‌ కానీ.. చెప్పిన కేసీఆర్‌ కానీ తమకు తాముగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాంటి సాధ్యం కాని నేపథ్యంలో.. ఇలాంటి మాటలు కేసీఆర్‌ అని ఉంటారన్న ప్రశ్న చూస్తే మాత్రం.. ఆయన గత రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వారు ఎవరికైనా ఇవేమీ కొత్త విషయాలుగా అనిపించవు.

సెక్షన్‌ 8 అమలు విషయంలో కేంద్రం కానీ వెనక్కి తగ్గక అమలు విషయంలో బలంగా ముందుకు వెళ్లాలని చూస్తే.. అసెంబ్లీని రద్దు చేసి.. ప్రజల్లోకి వెళితే.. సెంటిమెంట్‌ ఏ స్థాయికి చేరుకుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాధనలోనే కాదు.. తెలంగాణ సాధించిన తర్వాత కూడా సెంటిమెంట్‌ను రాజేసే తెలివితేటలు కేసీఆర్‌కు మాత్రమే సొంతమేమో..!