Begin typing your search above and press return to search.

కేసీఆర్ సీన్ రివర్స్..కారణం ఇదేనా ?

By:  Tupaki Desk   |   29 Dec 2021 7:32 AM GMT
కేసీఆర్ సీన్ రివర్స్..కారణం ఇదేనా ?
X
కేసీఆర్ లో టెన్షన్ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు విషయంలో సీన్ రివర్సవుతున్నట్లే అనుమానంగా ఉందట. అందుకనే అర్జంటుగా మేల్కొన్నారు. గడచిన ఏడేళ్ళుగా అధికారంలో ఉన్నా ఉద్యమకారులను, విద్యార్ధి నేతలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి హుజూరాబాద్ లో ఓటమి దెబ్బకు ఎక్కడో ఆకాశంలో ఉన్న కేసీఆర్ నేలపైకి దిగొచ్చారు. సంవత్సరాలతరబడి కావాలనే పెండింగ్ లో ఉంచేసిన పదవులన్నింటినీ అర్జంటుగా భర్తీ చేస్తున్నారు.

ఇంత అర్జంటుగా పదవులను భర్తీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే రాబోయే ఎన్నికల్లో సీన్ రివర్సయ్యే ప్రమాధముందని ఫీడ్ బ్యాక్ అందటమేనట. పదవులు ఇవ్వకపోవటంతో పాటు అనేక కారణాల వల్ల కేసీఆర్ పైన పార్టీ నేతల్లోనే విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోంది. పదవులు ఇవ్వకపోయినా, నేతల అవసరాలను పట్టించుకోకపోయినా తనకేమీ ఇబ్బందిలేదని ఇంతకాలం కేసీఆర్ అనుకునేవారు. అందుకనే ఎవరినీ లెక్కేచేయలేదు.

అయితే రోజులన్నీ ఒకేలాగుండదు కదా. పక్కలో బల్లెం లాగ బీజేపీ తయారైంది. ఈ విషయం హుజూరాబాద్ ఉపఎన్నికతో అర్ధమైపోయింది. అప్పటివరకు వేరేదారి లేక నోరుమూసుకుని కూర్చున్న నేతల్లో కొందరు ధైర్యం చేశారు. కేసీఆర్ పనైపోయిందని అనుకుంటున్న నేతల్లో కొందరు వెంటనే బీజేపీలో చేరిపోయారు. ఇంకా చాలామంది నేతలు బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. దాంతో తాను ఇప్పుడు కూడా ఎవరినీ పట్టించుకోకపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించినట్లున్నారు.

అందుకనే సంవత్సరాల తరబడి వెయిటింగ్ లో పెట్టిన నేతల్లో కొందరిని పిలిచి మరీ పదవులు కట్టబెడుతున్నారు. ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జల నగేష్, దుదిమెట్ల బలరాజ్, మన్నె క్రిశాంక్, సాయిచంద్, జూలూరి గౌరీశంకర్ లాంటి ఉద్యమంలో పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టారు. ఇంకా కొందరికి పదవులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మొదటినుండి పార్టీలో ఉన్న ఉద్యమకారులు, నేతల్లో తనపైన అసంతృప్తితోనే బీజేపీలో చేరటానికి రెడీ అయిపోతున్న కారణంగానే పదవులిస్తున్నారు.

కేసీఆర్ వాలకం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత వీజీ కాదని అర్ధమైపోతోంది. తన గెలుపుపై ఏమాత్రం నమ్మకమున్నా నేతల్లో ఎవరినీ లెక్కచేసేరకం కాదు కేసీఆర్. అలాంటిది ఇపుడు పిలిచి మరీ పదవులిస్తున్నారంటే బీజేపీలో ఎవరినీ చేరకుండా అడ్డుకోవాలన్నదే అసలైన వ్యూహంగా కనబడుతోంది. ఉద్యమకారులు, నేతలు గనుక బీజేపీలో చేరితే టీఆర్ఎస్ పుట్టి మునిగి సీన్ రివర్సవ్వటం ఖాయమని అర్ధమైందట కేసీఆర్ సారుకు.