Begin typing your search above and press return to search.

కేంద్రం అదొక్కటీ ఇస్తే చాలంటున్న కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   10 April 2015 6:57 AM GMT
కేంద్రం అదొక్కటీ ఇస్తే చాలంటున్న కేసీఆర్‌!
X
కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ఒక్కటీ తమకు అనుకూలంగా స్పందిస్తే చాలంటోంది కేసీఆర్‌ సర్కారు. ఆ ఒక్క విషయంలో సహకరిస్తే ఇక కేంద్రానికి రుణపడి ఉంటామని అనేస్తోంది ఈ ప్రభుత్వం! ఏమిటది? అంటే.. 24 గంటల విద్యుత్‌ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలంతే!

పల్లెలకు కూడా 24గంటల విద్యుత్‌ను సరఫరా చేసే పథకాన్ని ఒకటి అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ మూడు రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉంది. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాదిన రాజస్థాన్‌, దక్షిణాదిన ఏపీలో ఈ పథకం అమల్లో ఉంది. దీన్ని విస్తరించడంలో భాగంగా తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పటికే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో కేందమంత్రుల వద్ద ఈ కోరికను వెలిబుచ్చాడు.

తాజాగా రాష్ట్రాల విద్యుత్‌శాఖ మంత్రుల సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం గురించినే స్పందించింది. 24 గంటల విద్యుత్‌ సరఫరా అనే తమ డ్రీమ్‌ గురించి తెలంగాణ విద్యుత్‌శాఖమంత్రి మాట్లాడారు!

మరి ఎందుకీ తాపత్రయం అంటే.. ఈ విషయంలో తెలంగాణకు ఏపీతో పోటీ ఉంది. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఏపీలో కరెంటు కోతలు లేవు. మిగులు విద్యుత్‌ స్థాయికి చేరింది. కేంద్రప్రభుత్వం 24గంటలూ నిరంతరాయ విద్యుత్‌ సరఫరా పథకాన్ని ఏపీలో అమలు చేయడం ఆ రాష్ట్రానికి వరప్రదంగా మారింది.

ఇక ఏపీ, తెలంగాణల మధ్య ఎన్నిరకాలుగా పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఇప్పటికే కరెంటు విషయంలో ఏపీ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్లు తొడలు కొడుతున్నారు. దమ్ముంటే మాలాగా కరెంటును అందించి చూపించు అంటూ వీరు కేసీఆర్‌కు సవాలు విసురుతున్నారు.

కాలం కలిసొచ్చి తమ రాజకీయ వైరి పక్షం వారు అలా సవాలు విసరుతుంటే ఏం చేయలేక కేసీఆర్‌ చేతులు ముడుచుకొన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో శతవిధాలా ప్రయత్నిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాగైనా తమ రాష్ట్రంలో కూడా నిరంతరాయ విద్యుత్‌ పథకాన్ని అమలు చేయించుకోవాలని ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతానికి కేంద్రం నుంచి కేసీఆర్‌ ప్రభుత్వం కోరుకొంటున్నది ఏమీ లేదు. మరి ఈ విషయంలో కేంద్రం కేసీఆర్‌కు ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి!