Begin typing your search above and press return to search.

కేసీఆర్ మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారా?

By:  Tupaki Desk   |   30 Nov 2021 3:30 PM GMT
కేసీఆర్ మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారా?
X
కేంద్రప్రభుత్వంపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అవ్వడం చర్చనీయాంశమైంది. వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరును కడిగేశారు. కేంద్రంపై తగ్గేది లే అన్నట్టుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ ముఖ్యంగా కేంద్రాన్ని టార్గెట్ చేశారు. వరి సేకరణ విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కడిగేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ధర్నాలు, దీక్షలు.. కేంద్రంపై కొట్లాట వ్యాఖ్యలు ఇలా అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును, కేంద్రమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు.

బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం చెప్పిందని.. మరి రా రైస్ గురించి కూడా ఎంత తీసుకుంటారన్నది వివరించలేదన్నారు. యాసంగిలో తీసుకునేది లేదని స్పష్టం చేశారన్నారు. కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందన్నారు. నీటి తీరువా వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. కేంద్రప్రభుత్వం కోట్ల మంది ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ చిల్లరకొట్టు యజమానిగా వ్యవహరిస్తోందన్నారు.

అన్నీ డొంక తిరుగుడు మాటలే చెబుతోందన్నారు. రాజ్యాంగబద్దంగా ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ఇంత దిగజారిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అన్నీ అబద్దాలేనన్నారు. రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్రం లేఖ రాయించుకుందని.. అంతే తప్ప రాష్ట్రాలు ఇష్టపూర్వకంగా రాసింది కాదని స్పష్టం చేవారు. తెలంగాణలో వచ్చేది అంతా కూడా బాయిల్డ్ రైసేనన్నారు. మరి దీన్ని తీసుకుంటారా? పోనీ రాబియ్యం సేకరణపైన కేంద్రం ఏం చెప్పడం లేదని నిలదీశారు.

కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆయన సిపాయి మాదిరిగా పోరాడాలని.. కానీ కిషన్ రెడ్డి దద్దమ్మాలా మాట్లాడుతున్నారని.. ఉన్మాదిలా దాడి చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే ఆయన బాయిల్డ్ రైస్ కొనేలా చేయాలని సవాల్ చేశారు. మేం రైతు బంధువులం అని.. బీజేపీ నేతలు రైతు రాబందులు అని ఆరోపించారు.