Begin typing your search above and press return to search.

ఎంత కాంగ్రెస్ ను తిట్టాలంటే నెహ్రునూ తిట్టాలా?

By:  Tupaki Desk   |   7 Sep 2018 5:40 AM GMT
ఎంత కాంగ్రెస్ ను తిట్టాలంటే నెహ్రునూ తిట్టాలా?
X
రాజ‌కీయంలో భాగంగా విమ‌ర్శ‌లు చేయ‌టం.. ఆరోప‌ణ‌లు సంధించ‌టం మామూలే. కాకుంటే.. మ‌న మ‌ధ్య‌న లేని వారి మీద విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు కీల‌క‌స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. మ‌న మ‌ధ్య లేని వ్య‌క్తులు తీసుకున్న నిర్ణ‌యాల మీదా.. ఆ వ్య‌క్తి మంచి చెడ్డ‌ల మీదా స‌ర్టిఫికేట్ ఇచ్చే ముందు.. ఆ వ్య‌క్తి దానికి స‌మాధానం చెప్పే ప‌రిస్థితుల్లో ఉంటే ఓకే. కానీ.. అలాంటిదేమీ లేన‌ప్పుడు విమ‌ర్శ‌ల్ని సంధించ‌టం అనైతిక‌మే అవుతుంది.

తెలంగాణ విష‌యంలో కాంగ్రెస్ ను దూషించ‌టాన్ని పెంచిన కేసీఆర్ తాజాగా భార‌త తొలి ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రును కూడా సీన్లోకి తీసుకొచ్చేశారు. తెలంగాణ‌ను మోసం చేసింది.. అన్యాయం చేసింది ఆ పార్టీనే అన్న‌ది కేఈసార్ వాద‌న‌. అందులో నిజానిజాలు ఏమిట‌న్న దానిపైన ఎడ‌తెగ‌ని వాద‌న‌లు ఉన్నాయి.

తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కూడా.. త‌న దూష‌ణ‌ల ప‌ర్వాన్ని కేసీఆర్ ఎందుకు ఆప‌టం లేదు? తాను డిఫెన్స్ లో ప‌డిన‌ప్పుడు..తెలంగాణ సెంటిమెంట్ తో తాను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌ని భావించిన‌ప్పుడు ఒక్క‌సారి హీట్ పుట్టే వ్యాఖ్య‌లు చేయ‌టం కేసీఆర్ కు అల‌వాటే. తాజాగా అలాంటి తీరునే మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు.

అసెంబ్లీ ర‌ద్దు నేప‌థ్యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నెహ్రు మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌కీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. పార్టీ ల మ‌ధ్య సైద్దాంతికంగా ఎన్ని తేడాలున్నా నెహ్రు మీద ఇంత తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేసింది కేసీఆర్ మాత్ర‌మేన‌ని చెప్పాలి. పాత‌త‌రం నేత‌ల విమ‌ర్శ‌లు ఒక ప‌ద్ధ‌తిగా ఉండేవి. కానీ.. కేసీఆర్ తీరు అలా కాదు. ఆయ‌న కొన్ని అంశాల్ని ప్రాతిప‌దిక‌గా చేసుకొని టార్గెట్ చేస్తుంటారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు గ‌ట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్ర‌మే. మ‌రి.. ఆ పార్టీని ఎంత బ‌ద్నాం చేయ‌గ‌లిగితే అంత బ‌ద్నాం చేస్తేనే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు తిరుగు ఉండ‌ని ప‌రిస్థితి.ఈ కార‌ణంతోనే ఎప్పుడూ లేని విధంగా నెహ్రు మీద కూడా విమ‌ర్శ‌ల క‌త్తి క‌ట్టారు కేసీఆర్‌.

ఒక‌వేళ తెలంగాణ విష‌యంలో నెహ్రు అంత త‌ప్పే చేసి ఉంటార‌ని అనుకుందాం. మ‌రి.. కేసీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎమ్మెల్యే అయ్యాక అసెంబ్లీలో స‌మైక్య‌వాదాన్ని వినిపించిన దానికి ఆయ‌న స‌మాధానం ఏం చెబుతారు? రెండు తెలుగు రాష్ట్రాల్ని క‌లిపి ఒక‌టిగా చేయ‌టం ద్వారా భాషా ప్ర‌యుక్త రాష్ట్రాల విధానాన్ని తెలుగువారితోనే షురూ చేశార‌ని చెప్పాలి. అలాంటి ప్ర‌యోగం వెనుక ఇప్ప‌టి మాదిరి స్వార్థ రాజ‌కీయాలు ఉంటాయ‌ని భావించ‌లేం.

తెలుగు వారిని క‌లిపి త‌ప్పు చేశారా? ఒప్పు చేశారా? అన్న‌ది పెద్ద డిబేటే. ఒక‌వేళ‌.. క‌లిసి ఉంచ‌కుండా చేశార‌నే అనుకుందాం. ఈ రోజున ఇంత‌లా అభివృద్ధి చెందిన హైద‌రాబాద్ ఇంత భారీ స్థాయిలో ఉండేదా? అన్న ప్ర‌శ్న‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్పటి ప‌రిస్థితుల‌కు.. తెలంగాణ రాష్ట్రంలో సొంత స‌ర్కారు అధికారంలో ఉన్న ప‌రిస్థితుల‌కు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని తెలంగాణ ఉద్య‌మ‌కారులు ఇప్పుడు స్వ‌యంగా చెబుతున్నదే. ఉమ్మ‌డి రాష్ట్రంలో కోదండ‌రాం ఏదైనా స‌భ నిర్వ‌హించాల‌నుకుంటే బాజాప్తా అన్న‌ట్లు స‌భ పెట్టే వారు. కేసీఆర్ ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత అలాంటి ప‌రిస్థితి ఉందా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం అంద‌రికి తెలిసిందే.

తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో క‌ల‌ప‌టం త‌ప్పు అన్న‌ది నిజ‌మే అయితే.. కేసీఆర్ 2001 ముందు వ‌ర‌కూ స‌మైక్యానికి అనుకూలంగా మాట్లాడిన మాట‌ల్ని ఏ ప్రాతిప‌దిక‌న తీసుకోవాలి? అంత కాలం ఆయ‌న తెలంగాణ‌కు ద్రోహం చేసిన‌ట్లేనా? ఒక‌వేళ అదే నిజ‌మైతే.. అలాంటి వ్య‌క్తి నెహ్రు లాంటి నేత మీద విమ‌ర్శ‌లు చేయ‌ట‌మా? తిట్టాలి.. కానీ దానికో త‌రీఖా ఉండాలి. ఎదురుదాడి చేయాల‌ని.. అందుకు త‌గిన కార‌ణం చూపాలి. ఆరోప‌ణ చేయాలి అందులో ఎంతోకొంత వాస్త‌వం ఉండాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పాత‌త‌రం నాయ‌కుల మీద బుద‌ర చ‌ల్లే ప్ర‌క్రియ ఏ మాత్రం స‌రికాదు. అదే తీరును కేసీఆర్ అమ‌లు చేస్తానంటే.. భ‌విష్య‌త్ లో ఆయ‌న అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.